టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు శక్తి సామర్థ్యాలపై తనకు నమ్మకం ఉందని, చంద్రబాబు జూలు విదిల్చి తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చాలని కెవిపి షాకింగ్ కామెంట్స్ చేశారు. బిజెపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేపట్టిన ఉద్యమంలోకి చంద్రబాబు రావాలని కెవిపి కోరారు.
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై వేటు వేసిన నేపథ్యంలో కెవిపి ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పై అనర్హత కేసు గురించి ఏపీకి చెందిన ఏ ఒక్క ప్రజా ప్రతినిధి, ఎంపీ, ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదని, స్పందించలేదని, ఖండించలేదని కెవిపి అన్నారు. ఇటువంటి ఘటనలను ఖండించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తే కనీసం సీఎం జగన్ కూడా స్పందించలేదని తప్పుబట్టారు.
ఈ సందర్భంగానే అత్యంత గౌరవం ఉన్న ప్రతిపక్ష నేత ఏపీలో ఉన్నారని చంద్రబాబును ఉద్దేశించి కెవిపి వ్యాఖ్యానించారు. 1984లో నాదెండ్ల సంక్షోభం సమయంలో చంద్రబాబు పోరాటాన్ని ఎవరూ మర్చిపోరని కితాబిచ్చారు. 2018లో ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్షకు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన చంద్రబాబును కించపరచొద్దంటూ కాంగ్రెస్ నేతలకు గతంలో రాహుల్ సూచించిన విషయాన్ని కూడా కేవీపీ ప్రస్తావించారు.
కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు మౌనం వీడాలని కెవిపి అన్నారు. ఇక ప్రశ్నించడం కోసమే పుట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్….రాహుల్ గాంధీ సస్పెన్షన్ పై ఎందుకు స్పందించడం లేదని కెవిపి నిలదీశారు. సరైన కారణానికి సంఘీభావం తెలిపి ఖండించకుంటే భవిష్యత్తులో ఆ హక్కును కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. ఈ విషయం వైసిపి, టిడిపి, జనసేనలతో పాటు అన్ని పార్టీలకు వర్తిస్తుందని కేవీపీ చెప్పారు.