టీడీపీ నేడు 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవ నినాదంతో పుట్టి తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన టిడిపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుజాతికి చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పునరంకితమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
మరోవైపు, టిడిపి 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభకు ఇరు తెలుగు రాష్ట్రాలు, అండమాన్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు టిడిపి ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకాబోతున్నారు. 15వేల మందితో జరగబోతున్న ఈ సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
కాగా, పార్లమెంట్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టిడిపి ఎంపీలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన టిడిపి ఎమ్మెల్యేలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. టిడిపి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న టిడిపి ఎంపీలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.
వాజ్ పేయి హయాంలో టిడిపి, బిజెపిల మధ్య అనుబంధాన్ని నడ్డాకు టిడిపి ఎంపీలు వివరించారు. టిడిపితో బిజెపికి గతంలో ఉన్న సంబంధాల గురించి తనకు తెలుసని చెప్పారు. ఇటీవల జరిగిన అండమాన్ మేయర్ ఎన్నికల్లో టిడిపి-బిజెపి పొత్తు పెట్టుకుని విజయం సాధించాయి. ఈ సందర్భంగా గెలుపొందిన టిడిపి అభ్యర్థికి నడ్డా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏది ఏమైనా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో నడ్డా పాల్గొనడంతో టిడిపికి కేంద్రంలోని బిజెపి అండగా ఉందన్న విషయం మరోసారి స్పష్టమైందని తెలుస్తోంది.