తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రాంతీయ పార్టీ సత్తా చాట గలదు అని నిరూపించింది అన్నగారు. అటువంటి అన్నగారి పక్కన చేరి పార్టీలో తానే సర్వమై లక్ష్మీ పార్వతి చలాయించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. టిడిపితో పాటు నందమూరి కుటుంబం ముక్కలు కావడానికి లక్ష్మీపార్వతి కారణమని చాలామంది టీడీపీ నేతలు, నందమూరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటారు.
పార్టీలో అన్నగారి కంటే లక్ష్మీపార్వతి పెత్తనం ఎక్కువైందని, ఆమె కింద పనిచేయలేమని పలువురు టీడీపీ నేతలు ఎన్టీఆర్ ముందు వాపోయారని కూడా ప్రచారం జరిగింది. ఓ రకంగా లక్ష్మీపార్వతి సలహాల వల్లే చివరి రోజుల్లో టిడిపికి, దానిని స్థాపించిన అన్నగారికి దుస్థితి వచ్చిందని టిడిపి నేతలు కొందరు చెబుతుంటారు. కట్ చేస్తే ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా లక్ష్మీపార్వతి మాదిరిగానే వైసీపీ పతనానికి కారణం అవుతున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
టిడిపిలో లక్ష్మీపార్వతి పోషించిన పాత్రను ఇప్పుడు వైసీపీలో సజ్జల పోషిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ మేలుకోకుంటే వైసీపీలో సంక్షోభం తప్పదని హెచ్చరించారు. ఎన్టీఆర్ మంచివారైనా లక్ష్మీపార్వతి ప్రమేయం పార్టీ వ్యవహారాల్లో ఎక్కువ కావడం వల్ల 1995లో టిడిపిలో సంక్షోభం ఏర్పడిందని రఘురామ గుర్తు చేశారు. సరిగ్గా లక్ష్మీపార్వతి తరహాలోనే వైసీపీలో సజ్జల కూడా సకల శాఖా మంత్రిగా సర్వం తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పరిస్థితి చేయి జారకముందే సజ్జలను జగన్ పక్కన పెట్టాలని, లేకుంటే నేతలలో అసంతృప్తి పెరిగిపోతుందని జగన్ కు సూచించారు. గతంలో, సాక్షి ఉద్యోగి అయిన సజ్జలకు ఎమ్మెల్యేలు రిపోర్ట్ చేయాలని జగన్ సూచించడం సరికాదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి తాను ఓటు వేయలేదని సజ్జల ఏ ప్రాతిపదికన చెబుతున్నారంటూ ఆనం ప్రశ్నించడం సబబే అని రఘురామ అన్నారు. జగన్ మంచోడేనని, చేస్తుందంతా సజ్జలే అని సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో రఘురామ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.