ప్రతిభ ఉంటేనే సరిపోదు. దాన్ని సరైన పద్దతిలో చూపించాల్సిన అవసరం ఉంది. ఒక అద్భుతమైన సినిమాను తీస్తేనే సరిపోదు. దానికి సరైన రీతిలో ప్రచారం చేయాలి. ప్రేక్షకుల అభిమానం పొందిన తర్వాత అవార్డుల్ని సొంతం చేసుకోవాలంటే దానికో ప్రాసెస్ ఉంటుంది. అందునా ఆస్కార్ ను సాధించాలంటే అంత ఈజీ కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ అయినప్పటికీ.. ఆకాశంలో అందనంత దూరాన ఉంటుందన్న అస్కార్ ను సాధించే విషయంలో దర్శక ధీరుడు రాజమౌళి పుత్రరత్నం కార్తికేయ చేసిన కఠిన శ్రమ అంతా ఇంతా కాదు. ఈ కారణంతోనే.. అస్కార్ ను సాధించిన ఆనందంలోనూ కీరవాణి.. కార్తికేయ పేరును ప్రస్తావించటం మాత్రం మర్చిపోలేదు.
అస్కార్ పురస్కారాన్ని సాధించామన్న ఆనందాన్ని సైతం నాశనం చేసేలా పెద్ద ఎత్తున విమర్శల్ని చేయటం.. దాని ఖర్చుపై ఎవరికి తోచినట్లు వారు మాట్లాడటం తెలిసిందే. అసలు అస్కార్ బరిలోకి దిగిన తర్వాత అందుకోసం ఎంత ఖర్చు చేశారు? అన్నదానిపై బోలెడంత రచ్చ నడుస్తోంది. అలాంటివాటికి ఫుల్ స్టాప్ పెట్టటమే కాదు.. విమర్శకుల నోళ్లకు ప్లాస్టర్ వేసేలా తాజాగా కార్తికేయ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. లెక్కల్ని పైసలతో సహా చెప్పుకొచ్చారు. అస్కార్ ప్రాసెస్ కు.. దానికి చేసిన ప్రచారం కోసం పెట్టిన ఖర్చు లెక్కల్నిచెప్పేయటం ద్వారా మళ్లీ నోరెత్తకుండా చేశారని చెప్పాలి. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వివరాల్ని వెల్లడించారు,
కార్తికేయ ఏమేం చెప్పారన్నది చూస్తే..
వివిధ భాషల్లో సూపర్ సక్సెస్ అయ్యాక అమెరికాలో ఆర్ఆర్ఆర్ ఇంగ్లిష్ వెర్షన్ విడుదల చేయాలని అనుకున్నాం. థియేటర్ల వివరాలు సేకరించి ఒక రోజు స్క్రీనింగ్ కోసం 60 స్క్రీన్లలో ప్రదర్శించాలని ఎంపిక చేసుకున్నాం. సినిమా రిలీజ్ కు ఐదు రోజుల ముందే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఒక రోజు సరిపోతుందని అనుకుంటే ఏకంగా నెలకు పైనే ఆడేసింది.
ఈ సినిమాను అంతలా ఎందుకు ఆదరిస్తున్నారన్న విషయం తెలుసుకునేందుకు షో అయ్యాక.. ఫీడ్ బ్యాక్ తీసుకునేవాళ్లం. అందులో పాటలే కాదు.. అద్భుతమైన హీరోయిజం నచ్చిందని చెప్పేవారు. చరణ్ ను తారక్ ఎత్తుకొని ఫైట్ చేసే సీన్ తమకు చాలా బాగా నచ్చిందని చాలామంది చెప్పారు.ఆ టైంలోనే ఆర్ఆర్ఆర్ ఫర్ అస్కార్ ట్రెండ్ మొదలైంది.
అలా మొదలైన తర్వాత ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేముంది మాకు అనిపించింది. ఆర్ఆర్ఆర్ కు భారత్ నుంచి అధికారిక అస్కార్ ఎంట్రీ లభించనప్పుడు కాస్తంత బాధ కలిగింది. సినిమాను పంపి ఉంటే మరింత బలంగా ఉండేది. అస్కార్ కోసం క్యాంపెయిన్ చేసినప్పుడు చాలా ఖర్చు చేశామని.. అస్కార్ టీంను కొనేశామని.. అస్కార్ టికెట్ల కోసం భారీగా ఖర్చు చేశామని ఇలా ఎన్నో మాటలు వచ్చాయి.
సినిమా ప్రొఫైల్ పెంచటానికి డబ్బులు భారీగా ఖర్చు పెట్టామన్నప్రచారంఎందుకు వచ్చిందో తెలీదు. పబ్లిసిటీని బడ్జెట్ కు లోబడే చేశాం. ఎక్కడ ఎంతన్నది ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. డబ్బులు ఇస్తే అస్కార్ కొనుకోవచ్చన్నది పెద్ద జోక్. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న సంస్థ అది. అక్కడ ప్రతిది ఒక ప్రాసెస్ ఉంటుంది. సినిమా గురించి స్టీవెన్ స్పీల్ బర్గ్.. జేమ్స్ కామెరూన్ మాటల్ని కొనలేం కదా? అభిమానులే సినిమాను పెద్దగా ప్రచారం చేశారు. ప్రేక్షకుల ప్రేమను ఏమిచ్చి కొనగలం?
అస్కార్ క్యాంపెయిన్ కోసం హాలీవుడ్ సినిమా వాళ్లు పలు స్టూడియోలను ఆశ్రయిస్తారు. మాకు అలాంటి ఛాన్స్ లేదు. క్యాంపెయిన్ కోసం మేం అనుకున్న బడ్జెట్ రూ.5కోట్లు. అది కూడా ఎక్కువ అనిపించింది. వీలైనంత తగ్గించాలని అనుకున్నాం. మొత్తం ఖర్చును మూడు దశల్లో ఖర్చు చేయాలని నిర్ణయించాం. మొదటి ఫేజ్ లో రూ.3కోట్లు ఖర్చు చేశాం. నామినేషన్స్ తర్వాత మరికొంత బడ్జెట్ పెంచాం. మొత్తం క్యాంపెన్ కు రూ.5-6 కోట్లు అనుకున్నాం. కానీ.. రూ.8.5కోట్లు ఖర్చు అయ్యింది. ఇంత ఖర్చుకు కారణం న్యూయార్క్.. లాస్ఏంజిల్స్ లో ఎక్కువ స్క్రీనింగ్స్ వేయాల్సి వచ్చింది. అందుకు కాస్తంత అదనంగా ఖర్చు అయ్యింది.