ఏపీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం.. `అప్పులను కుప్పగా పోస్తే.. దానికి ఒక ఆకారం వస్తే.. అది ఏపీలానే ఉంటుంది`- అని తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెల్లడించింది. ఈ సంస్థకు పెద్దన్న పాత్ర పోషిస్తుందనే పేరుంది. రాష్ట్రాలు సహా.. కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులు.. ఇతర ఖర్చులను ఈ సంస్థ ఆడిట్ చేసి.. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెబుతుంది.
అదేసమయంలో ఖర్చులకు.. రాబడికి మధ్య వ్యత్యాసం.. పన్నురాబడి.. పథకాలు.. ఖర్చులు.. సంక్షేమ కార్యక్రమాలు ఇలా.. అన్నింటినీ భేరీజు వేసుకుని.. కాగ్ తన నివేదికను వెల్లడిస్తుంది. ఇలానే ఇప్పుడు ఏపీ విషయంలోనూ కాగ్ ఒక నివేదిక వెల్లడించింది. తాజాగా ఇచ్చిన నివేదిక దాదాపు చివరిది అనుకోవా లి. ఎందుకంటే.. వచ్చే ఏడాది ఎలానూ ఎన్నికల నామ సంవత్సరం కావడం గమనార్హం.
అప్పుడు ఇచ్చినా.. ఎవరూ పట్టించుకునే అవకాశం లేదు. సరే, తాజాగా ఇచ్చిన రిపోర్టులో ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల విషయం బహిర్గతమైంది. దాదాపు 90 శాతం అప్పులకు ప్రభుత్వం కడుతున్న వడ్డీ 14శాతం. సాధారణంగా ఏ కార్పొరేట్ సంస్థ కూడా ఈ రేంజ్లో అప్పులు చేయదు. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం చేస్తోంది. ఇదే విషయాన్ని కాగ్ తప్పుబట్టింది. ఇప్పటికే వ్యవస్థ గాడి తప్పిందని పేర్కొంది.
కట్ చేస్తే.. కాగ్ రిపోర్టు తర్వాత.. మేధావులు చెబుతున్నది ఏంటంటే.. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎవరు బాధ్యతలు చేపట్టినా.. ప్రయోజనం లేదని అంటున్నారు. అందుకే మాజీ సీఎం చంద్రబాబు కూడా.. రాష్ట్రం 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం చేసిన అప్పుల తాలూకు ఎఫెక్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంపై పడనుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది చూడాలి.