చట్టం చెప్పినట్లుగా చేయాల్సిందే. దాన్ని ఫాలో కావాల్సిందే. కొన్ని సున్నిత సందర్భాల్లో చట్టం పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా యధాతధంగా అమలు చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఉంటే.. విచక్షణ అలాంటి పదానికి అర్థం ఉండదుకదా? చట్టం కొన్నిసార్లు కరకుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. వాటి అమలు విషయంలో న్యాయన్యాయాలు ఆలోచించి.. ముందుచూపుతో వ్యవహరించటం ద్వారా పాలకులపై ప్రజల్లో గౌరవ మర్యాదలు దక్కుతుంటాయి.అందుకుభిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రధాని ఇంటి పేరును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ చేసిన విమర్శలపై సూరత్ కోర్టు రెండేళ్లు జైలు విధించిన సంగతి తెలిసిందే. న్యాయసూత్రాల్ని అనుసరించి చూస్తే.. కోర్టు ఎప్పుడైతే తీర్పును వెలువరించిందో.. ఆ వెంటనే అనర్హత అమల్లోకి వస్తుంది. అయితే.. దాన్ని ఎంతవరకు తీసుకోవాలన్నది అసలుసిసలు విచక్షణ. శిక్ష విధించిన కోర్టే.. ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసేందుకు వీలుగా నెల రోజుల పాటు గడువు ఇవ్వటం తెలిసిందే.
అలాంటప్పుడు.. అనర్హత విషయంలోనూ ఇది అమలవుతుంది కదా? 30 రోజుల పాటు వేచి చూసిన తర్వాత.. అప్పుడు చోటు చేసుకునే పరిణామాలతో అనర్హత వేటు వేస్తే సరిపోతుంది. అలా కాకుండా.. తీర్పు వచ్చిందో లేదో.. చట్టం రేసుగుర్రంలా పరుగులు తీస్తూ.. రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ (కేరళ) లోక్ సభ స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
రాహుల్ పై అనర్హత వేటువేసిట్లుగా లోక్ సభ ప్రకటించిన కాసేపటికే.. లోక్ సభ వెబ్ సైట్ లో దేశంలో ఖాళీగా ఉన్న లోక్ సభ స్థానాల జాబితాలో వయానాడ్ చేరింది. తాజా ఖాళీతో మొత్తం మూడు ఎంపీస్థానాలు ఖాళీగా ఉన్నట్లుగా పేర్కొంది. అందులో వయనాడ్ తో పాటు జలంధర్.. లక్షద్వీప్ స్థానాలు కూడా ఉన్నాయి. శిక్ష విధించే ముందు కాసింత ముందు వెనుకా ఆలోచించాలన్న ఆలోచన మోడీ సర్కారుకు లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.