మంచు ఫ్యామిలీ మెంబర్స్ మీద సోషల్ మీడియాలో కొన్నేళ్ల నుంచి జరుగుతున్న దాడి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వరుసగా వాళ్ల సినిమాలు ఫెయిలవడం.. దీనికి తోడు కొన్ని మాటల కారణంగా మోహన్ బాబు దగ్గర్నుంచి అందరూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. కానీ ఆ ట్రోలింగ్‌ను ఎప్పుడూ కూడా వాళ్లు పట్టించుకున్నది లేదు. పైగా సరదాగా తీసుకుని తమ మీద తామే జోకులు వేసుకోవడం స్పోర్టివ్ స్పిరిట్‌కు నిదర్శనం.
ఈ సంగతి పక్కన పెడితే ఇండస్ట్రీ జనాలు.. అలాగే ప్రేక్షకులు తమ గురించి ఏమనుకున్నా.. ఏం మాట్లాడినా.. మంచు ఫ్యామిలీ మాత్రం ఎప్పుడూ చాలా అన్యోన్యంగా కనిపించేది. మోహన్ బాబును ఆయన పిల్లలు గౌరవించే తీరు.. ముగ్గురు పిల్లల మధ్య అనుబంధం గొప్పగా ఉండేది. ఏవో కారణాలతో మంచు ఫ్యామిలీని విమర్శించేవాళ్లు కూడా వీళ్లంతా కలిసి మెలిసి సాగే తీరును అభినందిస్తారు.
అలాంటిది ఈ రోజు ఒక ఊహించని ఉదంతం చోటు చేసుకుంది. మోహన్ బాబు దగ్గర 20 ఏళ్లుగా పని చేస్తూ.. ప్రస్తుతం మనోజ్ దగ్గర ఉంటున్న సారథి అనే వ్యక్తిని కొట్టినట్లుగా మంచు విష్ణు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. స్వయంగా విష్ణు దాడి చేస్తున్న వీడియోను మనోజ్ ఆవేశంగా సోషల్ మీడియాలో పెట్టేశాడు. తర్వాత దాన్ని డెలీట్ చేశాడు. కానీ ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మంచు అన్నదమ్ముల గొడవ మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఐతే ఈ వ్యవహారంపై మోహన్ బాబు సీరియస్ అయి.. విష్ణు, మనోజ్‌లను మందలించినట్లు తెలుస్తోంది. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా విష్ణు రంగంలోకి దిగాడు. అతను ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తమ మధ్య జరిగిన గొడవ చాలా చిన్నదని.. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశాడు.
మనోజ్ తన తమ్ముడని.. తమ మధ్య ఉన్నవి అందరు అన్నదమ్ముల మధ్య ఉండే చిన్న చిన్న అభిప్రాయాల్లాంటివే అని చెబుతూ ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు విష్ణు. మరి మనోజ్ వెర్షన్ ఏంటన్నది చూడాలి.