తాజాగా వెల్లడైన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల ఫలితం తర్వాత అలాగే అనిపిస్తోంది. ఏడు ఎంఎల్సీ స్ధానాలకు జరిగిన ఎన్నికలో జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ ఫలితం వచ్చింది. ఏడు సీట్లకు ఏడూ గెలుస్తారని జగన్ అనుకుంటే అందులో ఒకసీటు ఓడిపోవటం ఆశ్చర్యంగా ఉంది. గెలుపునకు సరిపడా సంఖ్యాబలం లేకపోయినా పంచుమర్తి అనూరాధను చివరినిముషంలో చంద్రబాబు పోటీలోకి దింపి గెలిపించుకున్నారు. ఎవరూ ఊహించని రీతిలో పంచుమర్తికి 23 ఓట్లు రావటమే నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి.
సంఖ్యాబలముండి, టీడీపీ, జనసేన ఎంఎల్ఏలు ఐదుగురి మద్దతుండి కూడా వైసీపీ ఒక అభ్యర్ధిని ఓడిపోయిందంటే ఏమిటర్ధం ? చంద్రబాబు తెరవెనుక రాజకీయం ముందు జగన్ పనికిరారని అర్ధమైపోయింది. తాను అనుకున్నదే చేస్తాను, ముక్కుసూటిగా వెళతాను ముక్క పగిలినా పర్వాలేదని అనుకుంటే చివరకు పగిలేది ముక్కేకానీ గోడకాదు. ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం గోడను పక్కనపెట్టి మరీ ముందుకుళతారు. అందుకే ప్రతిసారి రాజకీయాల్లో అహం, మొండితనం, ముక్కుసూటితనం పనికిరాదని పెద్దలు చెప్పేది.
2019 ఎన్నికల తర్వాత నలుగురు ఎంఎల్ఏలు వైసీపీ ఆకర్షణలో పడి ప్రలోభాలతో టీడీపీకి దూరమయ్యారు. ఆ నలుగురి ఓట్ల స్ధానంలో వైసీపీకి చెందిన నలుగురు ఎంఎల్ఏల ఓట్లను వేయించుకుని చంద్రబాబు లెక్కసరిచేశారు. ఇద్దరు రెబల్ ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వైసీపీ అభ్యర్ధులకు ఓట్లేయరని అందరు అనుకుంటున్నదే. కాకపోతే వాళ్ళకు అదనంగా మరో ఇద్దరు ఎంఎల్ఏలను చంద్రబాబు మ్యానేజ్ చేశారన్నది స్పష్టమైంది. టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఆ ఇద్దరు ఎవరన్నది బయటజనాలకు సస్పెన్సుగా మారింది.
ప్రతి ఎంఎల్సీ అభ్యర్ధికి 22 మంది ఎంఎల్ఏలను కేటాయించినా, మంత్రులను ఇన్చార్జిలుగా పెట్టినా ఉపయోగం లేకపోయింది. క్రాస్ ఓటింగుకు పాల్పడిన ఇద్దరు ఎంఎల్ఏలు ఎవరనే విషయం జగన్ కు తెలుసని పార్టీవర్గాలు చెబుతున్నాయి. కోలా గురువులు, జయమంగళ వెంకటరమణకు కేటాయించిన 22 మంది ఎంఎల్ఏల్లో చెరో ఎంఎల్ఏ పార్టీ లైన్ దాటినట్లు అర్ధమైపోయింది. మొత్తానికి చంద్రబాబు లాంటి నేతను ఎదుర్కోవాలంటే జగన్ కూడా చంద్రబాబు లాగానే ఆలోచించాలి. తెరచాటు రాజకీయాలు అవసరం లేదని అనుకుంటే జగన్ కు ముందు ముందు మరిన్ని దెబ్బలు తప్పకపోవచ్చు.