ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఆశించిన విధంగా అయితే జరగలేదు. దీంతో ఒక స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. అయితే.. దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు సహకరించారనే వాదన తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. అధికార పపార్టీ వైసీపీ కూడా.. దీనిని చెప్పేసింది. చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి చెప్పారు. అంతేకాదు..త మకు ఏ పాపం తెలియదన్నారు.
ఈ నేపథ్యంలో సజ్జల కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
+ నిజానికి పొరుగు పార్టీ ప్రలోభ పెట్టేపరిస్థితి వచ్చిందంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారా? లేదా? అనేది పార్టీ గమనించలేదా?
+ అసలు ప్రతిపక్షం డబ్బులు పెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలనుకొనుగోలు చేసిందని సజ్జల చెప్పారు. నిజానికి అధికారంలో ఉన్న పార్టీ దగ్గర డబ్బులు ఉంటాయా? లేక ప్రతిపక్షం దగ్గర ఉంటాయా చెప్పాలి.
+ ప్రతిపక్షం తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని అంటున్న సజ్జల.. మరి ఇంత జరుగుతున్నా.. ఇంటిలిజెన్స్ ను రంగంలోకి ఎందుకు దింపలేక పోయారు? ఎందుకు విఫలమయ్యారు? అనేది ప్రశ్న.
+ ఎమ్మెల్యేలపై నిరంతరం నిఘా పెట్టలేదా? అసంతృప్తిగా ఉన్నవారిని దారికి తెచ్చుకోవడానికి పార్టీ ముఖ్యులను రంగంలోకి దింపలేదా?
+ ఎన్నికలకు 24 గంటల ముందు.. ఎమ్మెల్యేలకు కావలసిన పనులు చేసిపెడతామంటూ హామీలు గుప్పించలేదా? సీఎం జగనే స్వయంగా రంగంలోకి దిగలేదా?
+ అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్లలో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంటే ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. వలంటీర్లకు ప్రాధాన్యం ఇచ్చి తమను పూచిక పుల్లల్లా తీసివేయడం శాసనసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారిని విజయవాడకు పిలిచి.. ప్రత్యేక హోటళ్లు బుక్ చేసి.. వారితో మాట్లాడలేదా?
+ క్రాస్ ఓటింగ్ భయంతో ఎన్నడూ లేని స్థాయిలో వారికి రాచ మర్యాదలు చేయలేదా?
+ రోజుకు మూడుసార్లు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలను పలకరించడం.. విజయవాడలో పూటకో హోటల్లో విందులు.. మంత్రుల వద్ద పెండింగ్ పనులుంటే ఆగమేఘాలపై పూర్తి చేయడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం చేయలేదా?
+ తెల్లవారితే ఎమ్మెల్సీ కోటా ఎన్నికలనగా.. బుధవారం రాత్రి వైసీపీ ఎమ్మెల్యేలందరికీ విజయవాడలోని పలు హోటళ్లలో ప్రత్యేక విందులు ఇవ్వలేదా? వీటిని ఏమంటారు సజ్జల గారూ.. ప్రలోభాలు అనరా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.