ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ ఒక స్థానం గెలుచుకోవడం టీడీపీలో చర్చకు దారితీస్తోంది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరినవారితో పాటు కొందరు వైసీపీ నేతలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో మంత్రులు, మాజీ మంత్రుల పేర్లూ వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా కొద్దికాలంగా పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వసంత కృష్ణ ప్రసాద్‌తో పాటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కరణం బలరాం, మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అన్నా రాంబాబు, కొణుసు పార్థ సారథి, శిల్పా చక్రపాణిరెడ్డి, గొల్ల బాబూరావు, రాపాక ప్రసాద్ తదితరులపై పార్టీలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఖాళీ అయిన 7 స్థానాలకు గాను వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒకరు పోటీ పడ్డారు. వీరిలో వైసీపీకి చెందిన జయమంగళ వెంకటరమణ, కోలా గురువులు ఇద్దరికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు 21 చొప్పున సమానంగా వచ్చాయి. మిగతా ఆరుగురికి 21 కంటే ఎక్కువ ఓట్లు రావడంతో వారి విజయం ముందే ఖరారైంది.
వీరిద్దరికి 21 చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు సమానంగా రావడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. అందులో కోలా గురువులుకు ఎక్కువ రావడంతో ఆయన విజయం సాధించారు.
దీంతో వైసీపీ నుంచి ఆరుగురు అభ్యర్థులు, టీడీపీ నుంచి ఒకరు విజయం సాధించినట్లయింది. పోటీ చేసినవారిలో జయమంగళ వెంకట రమణ ఓటమి పాలయ్యారు.
2019లో టీడీపీ 23 సీట్లు గెలిచినప్పటికీ కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌లు వైసీపీ పక్షాన చేరడంతో టీడీపీ బలం 19కి పడిపోయింది. అయినా కూడా ఇప్పుడు ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల కంటే అధికంగా టీడీపీ అభ్యర్థికి 23 ఓట్లు రావడంతో కచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్నది అర్థమవుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కానీ ఎవరో నలుగురు ఓటేస్తే కానీ అనురాధ గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఆ నలుగురు ఎవరనేది వైసీపీలో పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలోనే మంత్రుల నుంచి ఫిరాయింపు ఎమ్మల్యేల వరకు అనేక మందిపై పార్టీ పెద్దలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.