ఏపీలో జనసేన, బీజేపీ పొత్తులపై మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయిన పీవీఎన్ మాధవ్ అసలు గుట్టు విప్పేశారు. తమ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందనుకోవడం ఉత్త మాటేనని ఆయన చెప్పేశారు. తమ రెండు పార్టీల మధ్య పొత్తే కనుక ఉంటే మొన్నటి ఎన్నికలలో ఇంత ఘోర పరాభవం ఉండేదికాదన్నారు.
తాను స్వయంగా పవన్ కల్యాణ్‌ను కలిసి మద్దతు కోరినా ఆయన నుంచి ఏమాత్రం స్పందన లేదని మాధవ్ చెప్పారు. అంతేకాదు… ఏపీలో బీజేపీ, వైసీపీ మధ్య మైత్రి ఉందని ప్రజలు భావించడం వల్ల తమకు నష్టం కలిగిందని ఆయన చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం తనపై పడి ఓటమి పాలయ్యానని ఆయన ఆవేదన చెందారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేషన్ వేసిన సమయంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అంటూ బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ, అప్పుడు కూడా మాధవ్ వెంట ఒక్క జనసేన నేత కూడా కనిపించలేదు. అయినా, బీజేపీ నేతలు మాత్రం జనసేన మద్దతు తమకు ఉందని చెప్పుకొన్నారు.
ఆ తరువాత ప్రచారం మొదలైన తరువాత జనసేన పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతిస్తోందన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని జనసేన ఏమాత్రం ఖండించలేదు. తాజాగా మాధవ్ కూడా అదే విషయం చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని ప్రచారం జరిగిందని, దీన్ని ఖండించాలని తాము జనసేన నాయకత్వాన్ని కోరామని, కానీ వారు ఖండించలేదని మాధవ్ వెల్లడించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమతో కలిసి రావడం లేదని అన్నారు.
జనసేన, బీజేపీ కలసికట్టుగా ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని నమ్ముతారని స్పష్టం చేశారు. బీజేపీతో సన్నిహితంగా ఉన్నామన్న సంకేతాలను వైసీపీ ప్రజల్లోకి బలంగా పంపిందని.. దాంతో ఏపీ బీజేపీ, వైసీపీ ఒకటేనని ప్రజలు నమ్మారని మాధవ్ వివరించారు. దీనివల్ల తాను ఓటమిపాలయ్యాని పేర్కొన్నారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆకర్షించడంలో టీడీపీ విజయం సాధించిందని మాధవ్ అభిప్రాయపడ్డారు.