ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇండో పాక్ మ్యాచ్ ను తలపించిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగగా…ఆల్రెడీ టీడీపీ రెండు కైవసం చేసుకుంది. ఇక, మూడో స్థానం కోసం వైసీపీ, టీడీపీ బలపరిచిన అభ్యర్థులు నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీగా పోరాడారు. ఎట్టకేలకు నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ అభ్యర్థి గెలుపొందాు. దీంతో, ఈ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసి మూడింటికి మూడు స్థానాల్లో విజయభేరి మోగించింది.
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో నిన్న జయకేతనం ఎగురవేసిన టీడీపీ తాజాగా పశ్చిమ రాయలసీమ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7,543 ఓట్లతో ఘనవిజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో, రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను తేల్చారు. ఓటమి ఖరారైన తర్వాత కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయంటూ రవీంద్రా రెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. చివరకు భారీ మెజారిటీతో ఓటమి పాలు కావడంతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించడం పట్ల పార్టీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. “పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్. ఇది ప్రజా విజయం, మార్పునకు సంకేతం. మంచికి మార్గం… రాష్ట్రానికి శుభసూచకం” అని చంద్రబాబు ట్వీట్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసనమండలికి వెళుతున్న వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రజాసమస్యలపై పోరాడాలని కోరుతున్నానని చంద్రబాబు తెలిపారు. మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉంటారని ఆశిస్తున్నానని అన్నారు.