వైసీపీ నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి జైలుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి, బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలు ఉండడంతో తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ ఆయనకు చుక్కెదురే అయింది.
సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేస్తూ అవినాశ్ కోరినలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది.అయితే.. అవినాశ్ తమకు సమర్పించిన ఆధారాలను సీబీఐకి ఇచ్చింది కోర్టు. అవినాశ్‌ను తదుపరి విచారణపైనా స్టే ఇవ్వలేమని.. సీబీఐ ఆయన్ను విచారించొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
అంతేకాదు… అవినాశ్‌తో పాటు ఆయన న్యాయవాదిని విచారణ వద్ద ఉండేలా ఆదేశించలేమనీ హైకోర్టు చెప్పింది. అయితే… అవినాశ్ రెడ్డి కోరినట్లు విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది.
కాగా అవినాశ్ అరెస్ట్‌ను ఆపేందుకు ఆయన అన్న, సీఎం జగన్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. జగన్ తాజా ఢిల్లీ పర్యటన కూడా అవినాశ్ అరెస్ట్ ఆపడానికేనన్నది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
అన్న కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే అవినాశ్ ఇప్పుడు సీబీఐ అరెస్ట్ చేస్తుందని ఆందోళన చెందుతున్నారని… తనను అన్న జగనే కాపాడుతారన్న ఆశతో ఉన్నారని చెప్తున్నారు. అయితే… ఇప్పుడు అవినాశ్ పరిస్థితి అన్నకు, అరెస్టుకు మధ్య ఉన్నట్లుగా ఉందని చెప్తున్నారు.
హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో అవినాశ్ అరెస్ట్ తప్పదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ జగన్ ఢిల్లీ పర్యటన కూడా అందుకే అయినా కూడా కేంద్రం ఇంతవరకు ఇలాంటి వ్యవహారాలలో ఎక్కువగా జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. పైగా అవినాశ్ రెడ్డి కోసం కేంద్రం సీబీఐని వెనక్కి లాగే పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. జగన్ కేసుల విషయంలోనే కేంద్రం ఆయనకు ఎలాంటి ఉపశమనాలు దొరికేలా సహకరించలేదు.. అలాంటిది ఇప్పుడు అవినాశ్ కోసం జగన్‌కు తలొగ్గడం అసాధ్యమని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.