ఉత్కంఠ వీడిపోయింది. టెన్షన్ తీరింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకున్నాయా? అన్నట్లుగా హైడ్రామా చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కవిత ను విచారించిన ఈడీ ఎపిసోడ్ లో. సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె అరెస్టు ఖాయమన్న వాదన జోరుగా వినిపించింది. తమ అంచనాలకు తగ్గట్లే విచారణ అనంతరం అరెస్టు నిర్ణయాన్ని ప్రకటిస్తే.. ఏం చేయాలన్న దానికి సంబంధించిన కసరత్తు భారీగానే సాగాయి. నిరసనలు ఎలా ఉండాలి? ఆందోళనలు ఏ రీతిలో చేపట్టాలన్న దానిపైనా జోరుగానే అంచనాలు సాగాయి.
తొమ్మిది గంటల సుదీర్ఘ విచారణ అనంతరం బయటకు వచ్చిన కవితను చూసిన గులాబీ నేతలు కాస్తంత రిలాక్స్ అయ్యారు. తాము అనుకున్నట్లుగా అరెస్టు లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కవిత విచారణ జరుగుతున్న వేళ.. హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మినహా.. గులాబీ దళానికి చెందిన ముఖ్యనేతలంతా దాదాపుగా ఢిల్లీలోనే ఉండటం తెలిసిందే. కవిత సోదరుడు కమ్ మంత్రి కేటీఆర్.. మేనబావ అయిన మంత్రి హరీశ్ తో పాటు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఢిల్లీలో గులాబీ బలగమంతా మొహరించటం తెలిసిందే.
అయితే.. తాము అనుకున్న ఉత్పాతం చోటు చేసుకోకపోవటంతో అప్పటివరకు వేడెక్కి ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీనికి తోడు విచారణ అనంతరం తిరిగి వచ్చే వేళ.. కవిత ముఖంలో కనిపించిన నవ్వులు సైతం గులాబీ సైన్యానికి కొత్త ఉత్సాహాన్నిఇచ్చేలా ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ ఒక ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించాలి. ఈడీ విచారణ కోసం ఉదయం 11 గంటల వేళకు.. ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత కాస్తంత ఉద్విగ్నంగా కనిపించారు. అందుకు తగ్గట్లే టీఆర్ఎస్ బలగంలోనూ అలాంటి తీరే కనిపించింది.
కవిత వెంట ఆమె భర్త అనిల్ తో పాటు.. న్యాయవాదులు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు.. కార్యకర్తలు కవితకు అనుకూలంగా నినాదాలు చేస్తూ వాహనం ముందు నడిచారు. ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేసి ఒక్కరే లోపలకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక్కరు మాత్రం ఈడీ కార్యాలయం గేటు వరకు వెళ్లి వెనక్కి వచ్చారు. కట్ చేస్తే.. రాత్రి ఎనిమిది గంటల వరకు ఆమె బయటకు వచ్చింది లేదు. ఎమ్మెల్సీ కవిత ఎప్పుడు బయటకు వస్తారా? అని గులాబీ దళం మొత్తం ఉద్విగ్నంగా ఎదురుచూస్తూ ఉండిపోయింది.