సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఎమ్మెల్సీ కవితతో పాటు.. ఏపీ వైసీపీ ఎంపీ ఆయన కుమారుడుతో పాటు పలువురు హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైకు బినామీలుగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొనటం తెలిసిందే.
ఈ సంచలన అంశం వెలుగు చూసిన 24 గంటల్లోనే మరో కీలక పరిణామానికి తెర లేచింది.
తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణ కోసం ఆమె తమ ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు.
హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నిస్తారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆమెకు నోటీసులు జారీ చేశారు.
ఈ విచారణకు గురువారం (మార్చి 9) తమ ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు. తాజాపరిణామాలు చూస్తే.. ఢిల్లీ మద్యం కుంభకోణం విచారణ కీలక దశకు చేరుకోవటంతో పాటు..మరిన్ని సంచలన పరిణామాలకు తెర తీసినట్లుగా భావిస్తున్నారు.
సౌత్ గ్రూప్ సంస్థలో కవిత కీలక భూమిక పోషించారన్న ఆరోపణలు గురించి తెలిసిందే. ఈ గ్రూప్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ముట్టజెప్పినట్లుగా ఈడీ ఆరోపిస్తోంది.
సౌత్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థలో కవిత తరఫున అరుణ్ భాగస్వామిగా ఉన్నట్లుగా ఈడీ పేర్కొన్న నేపథ్యంలో ఆమెకు నోటీసులు జారీ చేశారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.