సెలబ్రిటీలు, బాలీవుడ్ నటుల పేర్లతో క్రెడిట్ కార్డులు పొంది.. ఆన్లైన్లో రూ.21.32 లక్షల మేరకు కొనుగోళ్లు చేశారు సైబర్ నేరగాళ్లు. బాలీవుడ్ నటులు శిల్పాశెట్టి, అభిషేక్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ఇమ్రాన్ హష్మి సహా ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనిల పేర్లతో క్రెడిట్ కార్డులు సంపాయించారు. ఈ కార్డులను వినియోగించి ఆన్లైన్లో కొనుగోళ్లు జరిపారు. పుణేకు చెందిన స్టార్టప్ సంస్థ ఎఫ్‌పీఎల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ‘వన్ కార్డ్’ పేరు క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంది.
వీటిని ఆన్లైన్లో ‘వన్ కార్డ్-వన్ స్కోర్ యాప్’ ద్వారా వర్చువల్‌గానే ఇస్తుంటుంది. వీటి ద్వారా ఆన్లైన్లో లేదా, యాప్ ద్వారా కొనుగోళ్లు చేయవచ్చు. తాజా కేసులో ఐదుగురు వ్యక్తులు పునీత్, మహ్మద్ ఆసిఫ్, సునీల్ కుమార్, పంకజ్ మిశార్, విశ్వ భాస్కర్ శర్మలు ఎఫ్‌పీఎల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడన్న ఆన్లైన్లో సంప్రదించారు. అత్యంత విశ్వసనీయంగా అసాధారణ రీతిలో కంపెనీని మోసం చేసి సెలబ్రిటీల పేరుతో క్రెడిట్ కార్డులు సొంతం చేసుకున్నారు.
సైబర్ నేరగాళ్లు.. గూగుల్ నుంచి సెలబ్రిటీల పాన్, డేట్ ఆఫ్ బర్తలను సేకరించారు. వీటి ఆధారంగా క్రెడిట్ కార్డులకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేశారు. అంతేకాదు, పాన్ కార్డులో సెలబ్రిటీల ఫొటోలతో సరిపోలేలా.. నిందితులు తమ ఫొటోలను తీర్చిదిద్దుకు న్నారు. వాటినే దరఖాస్తులకు జత చేశారు.
ఉదాహరణకు అభిషేక్ బచ్చన్ పాన్ కార్డు, ఆయన పుట్టిన తేదీ వివరాలను యథాతథంగా వాడేసుకుని.. ఫొటోను మాత్రం అభిషేకు సరిపోలేలా తీసుకుని వినియోగించారు. క్రెడిట్ కార్డు మంజూరు కోసం కంపెనీ చేసిన వర్చువల్ ఇంటర్వ్యూలోనూ చాలా నమ్మకంగా, ఏమాత్రం తొట్రుపాటుకు లోనవకుండా వివరాలు వెల్లడించారు. ఆదాయ, వ్యయాల వివరాలను, ఇతరత్రా కీలకమైన అంశాలను కూడా వివరించారు.
సైబర్ నేరగాళ్ల వలకు చిక్కిన కంపెనీ.. వారికి క్రెడిట్ కార్డులు జారీ చేసేసింది. అయితే, చాలా వరకు దరఖాస్తులు ఒకే సిస్టమ్ నుంచి రావడంతో కం పెనీ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక వ్యవస్థ అప్రమత్తమై.. అలెర్ట్ చేసింది. దీంతో కంపెనీ నిర్వాహకులు మోసాన్ని గుర్తించారు. ఇలా మొత్తం 83 పాన్ వివరాలతో ఏడు సిస్టమ్‌ల నుంచి దరఖాస్తులు అందినట్టు గమనించారు. కానీ, అప్పటికే కొన్ని కార్డులు నిందితులు పేర్కొన్న అడ్రస్‌లకు చేరిపోయారు. దీంతో ఎఫ్‌పీఎల్ టెక్నాలజీస్ సంస్థ పోలీసులను ఆశ్రయించింది.
ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ల సాయంతో నిందితులు సెలబ్రిటీల పాన్ వివరాలు రాబట్టినట్టు డీసీపీ మీనా వివరించారు. ఇదే తరహాలో ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కూడా నిందితులు క్రెడిట్ కార్డులను పొంది ఉంటారని అనుమానిస్తున్నట్టు చెప్పారు.