ఏపీ సీఎం జగన్ పై ఇప్పటి వరకు నేరుగా ఎలాంటి విమర్శలూ చేయని ఉద్యోగ సంఘాలు.. ఇక, ఇప్పుడు ఆయననే టార్గెట్ చేసు కున్నట్టు కనిపిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా.. తమ కీలకమైన సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు.. చర్చలు చేసిన ఉద్యోగ సంఘాల నాయకులకు ఉద్యోగుల నుంచి తీవ్ర సెగ తగులుతోంది. దీంతో వారు ఇప్పుడు నేరుగా తమ బాణాన్ని జగన్‌పైనే ఎక్కుపెట్టినట్టు కనిపిస్తోంది. సీఎం జగన్‌పై ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు విమర్శలు చేయలేదు. అయితే, ఆయన ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నాయి.
అయితే.. ఇప్పటి వరకు కూడా ఆయా సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో ఇక, ఎన్నికలకు ముందు.. జగన్‌ను టార్గెట్ చేయడం ద్వారావారి సమస్యలుపరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా.. `జగన్తీరుతో బతకలేక పోతున్నాం“ అని ఉద్యోగ సంఘాల నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు బాహాటంగానే నిప్పులు చెరిగారు. అంతేకాదు.. చేతకానప్పుడు తమకు ఎందుకు హామీలు ఇచ్చారని.. ప్రశ్నించారు.
‘‘జగన్ సర్.. మాకు బతకలేని పరిస్థితి తీసుకువచ్చారు. కాబట్టే ఉద్యమబాట పడుతున్నాం. ఉద్యోగుల బకాయిలను రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని జీవో ఇచ్చారు. మాకు రావాల్సినవి డబ్బులు రావు. మేము దాచుకున్నవి ఇవ్వరు’’ అని ఏపీ జేఏసీ–అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 9 నుంచి మా ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉద్యమంపై మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగసంఘాలతో చర్చించారని, ఇప్పటికే ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని చెప్పామని తెలిపారు.
కరోనా దృష్ట్యా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించామని గుర్తుచేశారు. పీఆర్సీ రాయితీలను తగ్గించడం వల్లే రోడ్డు మీదకు వచ్చామని పేర్కొన్నారు. ఒకటో తేదీన ఇవ్వాల్సిన వేతనాలు ఎప్పుడిస్తారో తెలియదని వాపోయారు. తమది ఉద్యమం కాదు.. ప్రభుత్వం విస్మరించిన పనిని గుర్తుచేస్తున్నామని ప్రకటించారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన రాయితీలు ఇస్తామని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులసంఘం నాయకుడు కేఆర్ సూర్యనారాయణ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. జగన్ తీరుతో ఉద్యోగులు మానసిక ఆరోగ్యం చెడిపోయి.. నానా తిప్పలు పడుతున్నారని అన్నారు. ఉద్యమం తప్పదని హెచ్చరించారు.