సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగవంతమైన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో వైసిపి ఎంపీ, సీఎం జగన్ బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిల పేర్లు ముందు నుంచి బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి హత్య కేసులో వీరి ప్రమేయం ఉందంటూ వివేకా కూతురు వైఎస్ సునీత కూడా గతంలో సంచలన ఆరోపణలు చేయడం పెను దుమారం రేపింది.
ఈ క్రమంలోనే ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. పులివెందులలోని భాస్కర్ రెడ్డి నివాసంలో ఈ నోటీసులను సీబీఐ అధికారులు అందజేశారు. మార్చి 12వ తేదీన కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 18న భాస్కర్ రెడ్డి విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అయితే, ముందస్తు కార్యక్రమాలతో బిజీగా ఉన్నందువల్ల విచారణకు రాలేనని, తనకు కొంత సమయం కావాలని భాస్కర్ రెడ్డి కోరడంతో తాజాగా రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఆల్రెడీ సీఎం జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పిఎ నవీన్ లను కూడా సీబీఐ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఇచ్చిన సమాచారం ఆధారంగానే భాస్కర్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారని తెలుస్తోంది.
కాగా, వివేక హత్యకు ముందు రోజు నిందితులంతా వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే మకాం వేశారని, హత్య జరిగిన రోజు కూడా నిందితులు ఆ ఇంట్లోనే ఉన్నారని కొన్ని ప్రముఖ వార్తా పత్రికలలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. వివేకా హత్య కుట్ర గురించి అవినాష్ రెడ్డికి ముందుగానే సమాచారం ఉందని కూడా ఆ కథనంలో ప్రచురించారు. ఏదేమైనా వివేకా హత్యకేసు అవినాష్ రెడ్డి మెడకు బిగుసుకునేటట్టు కనిపిస్తోందని, రాబోయే ఎన్నికలకు ముందు జగన్ కి, వైసీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.