ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వర్సెస్ ప్రభుత్వం అన్నరీతిలో ఏడాదిన్నర కాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సిపిఎస్ రద్దు హామీ, సకాలంలో జీతాల చెల్లింపులతోపాటు తమ డిమాండ్ల పరిష్కారం కోసం గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పలుమార్లు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే, చర్చల పేరుతో ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించిన ప్రభుత్వ పెద్దలు వారు సమ్మెకు వెళ్లకుండా నివారించగలిగారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి సమ్మె చేస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో ప్రతినెలా జాప్యం జరుగుతోందని, ప్రభుత్వ తీరుతో ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ఆయన దుయ్యబట్టారు.
ప్రభుత్వ అనుగ్రహంతో ఉద్యోగులకు జీతాలు రావడం లేదని, ప్రతినెలా ఒకటో తారీకున జీతాలు తీసుకోవడం ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని సూర్యనారాయణ అన్నారు. ఇక, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాల చెల్లింపు విషయంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలలో చట్టబద్ధత తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకటో తేదీనే జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేలా చట్టం తీసుకురావాలని కోరారు.
ఇక, ఉద్యోగుల జిపిఎఫ్ కూడా పేపర్లపైనే ఉంటోందని, ఖాతాల్లో ఉండడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఏప్రిల్ లో భారీ స్థాయిలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని వెల్లడించారు. కాగా, తమ డిమాండ్ల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం ఉద్యమ కార్యచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 9 నుంచి ఉద్యమం చేయబోతున్నామని ఏపీ సిఎస్ జవహర్ రెడ్డికి ఆ సంఘం నేతలు నోటీసులు కూడా ఇచ్చారు.
ఫోన్ డౌన్, పెన్ డౌన్, భోజన విరామ సమయంలో నిరసనలు, కలెక్టరేట్ లో స్పందన దరఖాస్తులు…ఇలా దశలవారీగా నిరసన వ్యక్తం చేస్తామని, ఫలితం లేకుంటే సమ్మెకు వెళ్తామని వారు హెచ్చరించారు. ఈసారి చాయ్ బిస్కెట్ చర్చలతో రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలకు అల్టిమేటం జారీ చేశారు. మరి, ఉద్యోగ సంఘాల నేతలను ఈ సారి కూడా ప్రభుత్వ పెద్దలు బుజ్జగిస్తారా? లేదంటే ఉద్యోగులు పోరుబాట పడతారా అన్నది తేలాల్సి ఉంది.