మనదేశ రాజకీయ రంగంలో సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే, కట్టుబ్టలతో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా చంద్రబాబును ప్రజలు ఎన్నుకున్నారు. ఆ నమ్మకానికి తగ్గట్లుగానే భారత్ లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నిలపాలన్న లక్ష్యంతో చంద్రబాబు తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి ‘అమరావతి’ అభివృద్ది ప్రణాళికలు రచించారు.
ఆ క్రమంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అమరావతికి ఆనాడు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించేందుకు చంద్రబాబు అహరోరాత్రులు కష్టపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల డిజైన్లు..మరెన్నో మోడళ్లు..పరిశీలించారు. వందలాది మంది ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ లతో నిర్మాణ రంగ నిపుణులతో చర్చించారు. అమరావతి తనంతట తానే సంపద సృష్టించుకునేలా, తనకు తానే పెట్టుబడులు తెచ్చుకునేలా చంద్రబాబు ప్లాన్ వేశారు. కానీ, ప్రజాతీర్పునకు చంద్రబాబు తల వంచాల్సి వచ్చింది.
ఆ తర్వాత జగన్ సీఎం కావడం..అమరావతిని అధ:పాతాళానికి తొక్కేయడం చకచకా జరిగిపోయాయి. కోర్టు తీర్పులిచ్చానా..రైతులు ఉద్యమాలు చేస్తున్నా..జగన్ మాత్రం అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు అమరావతి స్వయంగా షాకిచ్చింది. తాజాగా ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ డైజెస్ట్ మ్యాగజైన్ జాబితాలో అమరావతి రాజధాని 6వ స్థానంలో నిలిచి తన ఖ్యాతి ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది.
అర్ధాంతరంగా తన గొంతు నొక్కాలని చూసినా….తన ఆర్తనాదం ప్రపంచానికి వినిపిస్తుందని నిరూపించింది. నిర్మాణంలో ఉన్న ప్రపంచ స్థాయి నగరాల జాబితాను ఆ సంస్థ విడుదల చేయగా అందులో అమరావతి 6వ స్థానంలో నిలిచింది. ఆ జాబితాలో అమరావతి ఆరో స్థానం దక్కించుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. స్థిరంగా అభివృద్ధి చెందే ఆధునిక నగరం అమరావతి అని, ప్రపంచపటంలో ఏపీతో పాటు భారత్ గర్వపడేలా అమరావతిని నిర్మించాలని సంకల్పించానని ఆయన అన్నారు.
కాగా, అనివార్య కారణాల వల్ల అమరావతి కార్యరూపం దాల్చలేదని ఆ మ్యాగజైన్ పేర్కొంది. కానీ, కొత్త రాజధానులకు అమరావతి ఒక రోల్ మోడల్ అని కొనియాడింది. ఢిల్లీ, న్యూయార్క్ తరహాలో అమరావతి నగరం మధ్యలో భారీగా పచ్చదనం, నీరు ఉండేలా డిజైన్ చేశారని పొగడ్తలలో ముంచెత్తింది. అమరావతి రూపుదిద్దుకొని ఉంటే ప్రపంచ మహా నగరాల్లో సుస్థిర స్థానం తప్పకుండా దక్కించుకొని ఉండేదని అభప్రాయపడింది.