టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాభివృద్ధి కోరుకునే వారంతా రాజకీయాలపై దృష్టి పెట్టాలని, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లోకేష్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ కామెంట్లపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.
ఈ సందర్భంగా లోకేష్ పై కొడాలి నాని విమర్శలు గుప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ను లోకేష్ టిడిపిలోకి ఆహ్వానించడం ఏమిటని నాని ప్రశ్నించారు. టిడిపిని స్థాపించింది జూనియర్ ఎన్టీఆర్ తాత అన్న నందమూరి తారకరామారావు అని నాని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలుస్తుందన్న నమ్మకం లేదని, అందుకే పార్టీలోకి తారక్ ను ఆహ్వానిస్తున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే టీడీపీకి కనీసం ప్రతిపక్ష హోదా అయిన వస్తుందని విమర్శలు గుప్పించారు.
టిడిపి ఊబిలో కూరుకుపోయిందని, అటువంటి పార్టీని రక్షించేందుకు ఎవరు వెళ్లినా అందులోనే కూరుకుపోవడం ఖాయమని కొడాలి నాని జోస్యం చెప్పారు. లోకేష్ కు ప్రజల్లో విశ్వసనీయత లేదని, అందుకే మంగళగిరిలో బ్రాహ్మణి ప్రచారం చేసిన లోకేష్ ఓటమిపాలయ్యారని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. లోకేష్ కు బదులు బ్రాహ్మణి పోటీ చేసి ఉన్నా మంగళగిరిలో గెలిచి ఉండేవారిని అన్నారు.
మంగళగిరిలోనే టిడిపిని గెలిపించలేనివారు రాష్ట్రంలో ఎలా గెలిపిస్తారని ప్రశ్నించారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని ఆ తర్వాత అవమానించారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆ అవమానాలు అనుభవించిన జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండిపోయారని అన్నారు.