నరం లేని నాలుక ఏమైనా అంటుంది. అందులోకి అబద్ధాన్ని సైతం నిజంగా.. అది కూడా అతికినట్లుగా చెప్పే విషయంలో జగన్ అండ్ కోకు ఉన్న టాలెంట్ వేరే లెవల్ అని చెప్పాలి. అందుకు తగ్గట్లే వారి మాటలు ఉంటాయి. తమ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో వైసీపీ ఎంచుకునే అంశాలు.. వాటిని ప్రచారం చేసే విషయంలో అనుసరించే దూకుడు మిగిలిన వారికి భిన్నంగా ఉంటాయి. ప్రత్యర్థి గుర్తించే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగేలా వారి ప్లానింగ్ ఉంటుంది. వారి ప్లానింగ్ కి అడ్డంగా బలైన కుటుంబం మెగా కుటుంబం అని చెప్పాలి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.
పవన్ కళ్యాణ్ ని ప్యాకేజీ స్టార్ గా.. పావలా పవన్ కల్యాణ్ గా నోటికి వచ్చినట్లుగా ప్రచారం చేసే జగన్ అండ్ కో.. గడిచిన నాలుగేళ్లుగా అధికారంలో ఉంది. వారు తలుచుకుంటే ఎవరి ప్రైవేటు సంభాషణల్ని సైతం గుట్టుగా వినేందుకు వీలుగా వ్యవస్థలు వారి చేతుల్లో ఉన్నాయి. అలాంటి వేళ.. పవన్ కు సంబంధించిన ప్యాకేజీ అంశాలపై ఇప్పటికే ఆధారాలతో సహా బోలెడన్ని కథనాలు… సోషల్ మీడియా ‘స్టోరీ’ల్ని తయారు చేసే వీలుంది. కానీ.. అలాంటిదేమీ చేయలేకపోయారు.
కారణం తాము చెప్పే మాటలకు తగ్గ ఆధారం ఒక్కటి కూడా దొరక్కపోవటమే. ఏమీ లేనప్పుడే గాలిని మూట గట్టేసి.. మాయ మాటలతో అమ్మేసే వారు.. నిజాలతో సంబంధం లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం తెలిసిందే. పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అన్నంత తేలిగ్గా.. అందుకు తగ్గట్లుగా ఆధారాల్ని చూపించే పరిస్థితి లేదు. నిజానికి పూర్తి ఆధారాలు లేకున్నా.. కనీసం వెంట్రుక మందంగా ఏదైనా విషయం తెలిసి ఉన్నా.. పరిస్థితులు మరోలా ఉండేవని చెప్పక తప్పదు.
జనసైనికులు కావొచ్చు.. పవన్ సాయం కోరే తెలుగు తమ్ముళ్లు సైతం పవన్ కల్యాణ్ మీద చేసే ప్యాకేజీ ఆరోపణలకు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని చూపించాలని డిమాండ్ చేయకపోవటాన్ని మర్చిపోకూడదు. రాబోయే రోజుల్లో కాబోయే మిత్రుడిగా ఉండే పవన్ మీద దుష్ఫప్రచారం జరగకుండా నిలువరించాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటి ప్రయత్నాలు పెద్దగా జరగటం లేదు. దీనికి భారీ మేథోమధనం అవసరం లేదు. రోజువారీ అప్డేట్స్ కు బలమైన కౌంటర్ ఇచ్చేస్తే సరిపోతుంది.
ఇప్పటికే వైసీపీ నేతలు.. కార్యకర్తలు.. జగన్ అభిమానులు.. తాము టార్గెట్ చేసిన పవన్ విషయంలో వారి తప్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. వివిధ సందర్భాల్లో పవన్ పై చేసిన విమర్శలు కనిపిస్తాయి. అవేమంటే..
– 2014లో ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి పవన్ ప్యాకేజీ తీసుకున్నాడంటూ ప్రచారం
– 2019లో సొంతంగా పోటీ చేశాడు కాబట్టి ప్యాకేజీ తీసుకున్నాడు.
– 2024లో దమ్ముంటే ఒంటరిగా రా.. లేకుంటే ప్యాకేజీ తీసుకున్నట్లే
– ఒంటరిగా పోటీ చేశావంటే ప్యాకేజీ తీసుకున్నట్లే
ఇదంతా చూసినప్పుడు ప్యాకేజీ అన్న పదం కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి 2014లో పవన్ వ్యవహరించిన తీరుకు 2019 తీరుకు మధ్య పోలికే ఉండదు. పోటీచేయలేదు కాబట్టి ప్యాకేజీ తీసుకున్నాడన్నదే నిజమైతే.. మరి సొంతంగా పోటీ చేసినప్పుడు ప్యాకేజీ మాట ఎలా? కానీ.. ఇవేమీ ఆలోచించకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం చూసినప్పుడు.. పవన్ ను ఏదో ఒక మిష మీద విషం చిమ్మటం.. తప్పుడు ప్రచారం చేయటం.. తాము తెర మీదకు తీసుకొచ్చిన ‘‘ప్యాకేజీ పవన్’’ అన్న మాటను సజీవంగా ఉంచటం కోసం ఇంతలా శ్రమిస్తారని చెప్పక తప్పదు.
నిజంగా పవన్ కానీ తప్పు చేసి ఉంటే ఈపాటికి చాటలు కట్టేసేవారు. కనీసం.. ఏదోలా కేసులు నమోదయ్యేవి. అవేమీ జరగలేదంటే.. పవన్ ఎంత క్లీన్ చిట్ గా ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.