ఏపీలో వచ్చే ఎన్నికల్లో కూడా విజయం దక్కించుకుని రికార్డు సృష్టించాలని భావిస్తున్న వైసీపీ.. కేవలం విజయాన్ని మాత్రమే లక్ష్యం పెట్టుకోలేదు. వచ్చే ఎన్నికల్లో ఏకంగా 175 స్థానాలకు 175 స్థానాల్లోనూ విజ యం దక్కించుకుని తీరాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అనేక పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలను కూడా అప్పులు చేసి మరీ చేస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్న తమకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న ప్రచారంతో కొట్టుకుపోతున్నాయనే ఆవేదన ఉంది.
ఆందోళన కూడా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కరోనా ముందు వరకు బాగానే ఉన్నప్పటికీ.. కరోనా తగ్గిన తర్వాత.. అనూహ్యంగా టీడీపీ పుంజుకుంది. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టి.. ప్రజల్లోకి వెళ్లిం ది. అంతేకాదు.. ఇదే ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది నిరంతరాయంగా.. ఎన్నికల వరకు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మరోవైపు.. యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ దూకుడు పెంచారు.
ఇటు చంద్రబాబు, అటు నారా లోకేష్‌లు.. సర్కారుకు పంటికింద రాయిమాదిరిగా.. కంట్లో నలుసు మాదిరిగా వ్యవహరిస్తున్నారనేది పరిశీలకుల అంచనా. అందుకే.. వైసీపీ భయపడుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత లేదన్నా.. ప్రచారాన్ని ప్రజలు విశ్వసిస్తారు. పైగా.. ఆధారాలతో సహా.. చంద్రబాబు, నారా లోకేష్‌లు ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో వైసీపీకి ఇబ్బందికరంగా మారిందనేది ఆ పార్టీ నేతల మాట కూడా.
ఈ నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు, అటు నారా లోకేష్‌ల యాత్రలకు సహజంగానే ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే.. ఇప్పటికే ఎన్నో చేశామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడాల్సిన పరిస్థితి వచ్చిందనేదే… ప్రశ్న. ప్రజలు తమవైపే ఉన్నారని.. తమకు అనుకూలంగా ఉన్నారని.. పదే పదే చెబుతూనే ఎక్కడో భయపడుతున్న సంకేతాలు ఇస్తుండడం సొంత పార్టీలోనే నేతల మధ్య చర్చకు దారితీసింది. మరి చివరకు ఇది ఎలాంటి దారి తీస్తుందో చూడాలి.