దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో గవర్నర్లను మారుస్తూ.. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ క్రమంలో ఏపీ సహా.. 13 ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ల ను కొత్తవారిని నియమించడం.. ఉన్నవారిని బదిలీ చేయడం చేశారు. మొత్తం 13 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్ర లో వివాదస్పదంగా ఉన్న గవర్నర్ రమేశ్ బైస్ నియమితులయ్యారు.
మొత్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా రమేశ్ బైస్ను నియమించారు. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను ఆమోదించారు. ఇప్పటివరకు ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నారు రమేశ్.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివ్ ప్రతాప్‌లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, లద్దాఖ్ ఎల్జీగా ఉన్న ఆర్కే మాథుర్ రాజీనామాను ముర్ము ఆమోదించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను ఆయన స్థానంలో నియమించారు.
అయితే.. ఇప్పుడు ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఇంత మంది గవర్నర్లను మార్చడం.. కొందరిని బదిలీ చేయడం.. రాజకీయంగాకూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మరి దీని వెనుక కేంద్రంలోని నరేంద్ర మోడీ ఏం ఆశిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. ఇప్పుడు జరిగిన మార్పు రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించడం ఖాయమని అంటున్నారు.