ఏ వయసు వారు మద్యానికి అలవాటు పడుతున్నారు.. వారిని ఎలా అడ్డుకుందాం.. మద్యానికి బానిసలు కాకుండా ఎలా చూద్దాం.. అని ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తుంది. ఇది ఏ మాత్రం బాధ్యత ఉన్న ప్రభుత్వ మైనా చేసే పని! అయితే.. దీనికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సర్వే చేస్తోంది. ఏవయసు వారితో `ఎంత తాగిద్దాం` అనే కాన్సెప్టుతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయిస్తోంది.
వయసుల వారిగా.. ఇష్టపడే మద్యం బ్రాండులు ఏంటి? ఎవరెవరు ఏయే బ్రాండులు ఇష్టపడుతున్నారు..? ఏయే మోతాదులో కొరుకుంటున్నారు.. (అంటే.. క్వార్టర్, 90 ఎంఎల్.. హాఫ్ ఇలా అన్నమాట.).. ఏయే సమయాల్లో కావాలని కోరుకుంటున్నారు.. వంటి అంశాలపై సర్వే చేయించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయకపోవడం గమనార్హం.
అయితే.. వచ్చే పాతికేళ్లపాటు మద్యం పై వచ్చే ఆదాయాన్ని తనఖా పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఇలా చేయడంలో ఆశ్చర్యం అనిపించడం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇక, గత ఎన్నికల సమయంలోను.. తర్వాత కూడా.. రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని, మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని పలు సందర్భాల్లో సీఎం జగన్ చెప్పారు.
కానీ, ఇప్పుడు దీనికి విరుద్ధంగా.. మందుబాబులతో మరింత ఎక్కువగా తాగించటమెలా? తద్వారా ఆదాయం ఇంకా పెంచుకోవటమెలా.. అనేదానిపై దృష్టిసారించారు. అమ్మకాలు ఏ సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయి? మందుబాబులు ఎలాంటి మద్యం తాగటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? ఏ వయసువారు ఎక్కువగా కొంటున్నారు? డిమాండుకు తగ్గట్లుగా మద్యం సరఫరా అవుతోందా.. లేదా? వంటి అంశాలపై ఈ సర్వే చేయిస్తోంది.
లోటుపాట్లు ఎక్కడున్నాయో చూసుకుని వాటికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు రూపొందించుకోవ టం, అమ్మకాలు పెంచుకోవటమే ఈ సర్వే లక్ష్యంగా కనిపిస్తోంది. మద్యం దుకాణాల సూపర్వైజర్లకు ఓ ప్రశ్నావళిని పంపించింది. ఆన్లైన్లో సమాధానాలివ్వాలని ఆదేశించింది. ఇటీవల బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఈ ప్రశ్నావళికి సమాధానాలు పంపించాలని సూపర్వైజర్లను ఆదేశించడం గమనార్హం.