"రాజకీయాలు పక్కనబెడితే రాష్ట్రానికి కావాల్సింది @ncbn గారే. ఆయనతోనే అమరావతి అభివృద్ధి చెందుతుంది." ఈ మాట అన్నది వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి. ఆశ్చర్యంగా ఉంది కదా! అందుకే ఈ సెల్ఫీ వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరూ చూడండి.#TDPforDevelopment#NCBN pic.twitter.com/SxSl9WukZp
— Telugu Desam Party (@JaiTDP) February 4, 2023
‘చంద్రబాబు చార్టర్ ఫ్లైట్ లో ప్రయాణిస్తుంటారని అంటారు. కానీ.. అది నిజం కాదు. ఆయన పక్కనే నేను కూర్చున్నా. నేను వైసీపీ అని చెప్పాక కూడా.. అవేమీ పట్టించుకోకుండా పక్కన కూర్చోబెట్టుకున్నారు’ అంటూ ఎమోషన్ అయిపోయాడు మీరావలి. ఈ యువకుడు ఎవరు? ఉన్నట్లుండి ఒక్కసారిగా వైరల్ గా మారిన ఈ వీడియోలో కనిపించే మీరావలి ఏపీలోని పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఒక యువకుడు. వైసీపీకి వీరాభిమాని.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఇస్తుంటాడు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నాడు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. అలాంటి వ్యక్తి చంద్రబాబు పక్కన కూర్చున్న తర్వాత తన ఎంగ్జైటీని ఆపుకోలేకపోయాడు. అప్పటికప్పుడు ఒక సెల్ఫీ వీడియోను తీశాడు. అందులో చంద్రబాబు పక్కన చూపిస్తూ.. తాను బాబు పక్కన కూర్చున్నానని.. ఆయన్ను చార్టర్ ఫ్లైట్ లో ప్రయాణిస్తారని ఆడిపోసుకుంటారని.. కానీ అది నిజం కాదని.. తాను ఇండిగో ప్లైట్ లో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్నట్లుగా పేర్కొన్నారు.
తాను వైసీపీ అని చెప్పినా.. చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదని పేర్కొంటూ.. చంద్రబాబు విజన్ తనకు నచ్చుతుందన్నారు. తాను వైసీపీ వీరాభిమానినే అయినా.. చంద్రబాబు దార్శనికుడని.. అమరావతి కోసం ఆయన ఎంతో చేశారన్నారు.
చంద్రబాబును పరిచయం చేసుకుంటూ తన పేరు మీరావలని అని.. తాను వైసీపీ పెట్టిన నాటి నుంచి పార్టీలో కీలకంగా ఉన్నానని.. కానీ తన వరకు రాజధానిగా మాత్రం అమరావతే ఉండాలన్నారు.
‘మీలాంటి వ్యక్తి అవసరం ఉంది. రాజధానిగా అమరావతినే ఉండాలి’ అని పేర్కొన్న నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న వీడియోను ట్విటర్ లో పోస్టు చేశాడు. దీన్ని టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతా రీపోస్టు చేసింది. చంద్రబాబు పక్కన కూర్చున్న వైసీపీ యూత్ లీడర్ నోటి నుంచి వచ్చిన ప్రశంసలు వైసీపీ వర్గాలకు మంట పుట్టేలా మారాయి.
ఆయన తీరును తప్పు పడుతున్నాయి. మరోవైపు.. వైసీపీకి చెందిన వీరాభిమాని.. చంద్రబాబు విజన్ ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఒక చిట్టి వీడియోతో మీరావలి పార్టీని భారీగా డ్యామేజ్ చేశాడంటూ వైసీపీ వర్గాలు పేర్కొనటం గమనార్హం. మరేం జరుగుతుందో చూడాలి మరి.