తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేసి గెలిచి.. వైసీపీకి వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వార్తల్లోకి వచ్చారు. సొంత పార్టీకి చెందిన నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. తాను టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు.. వైసీపీ తరఫున పోటీ చేసి తన చేతిలో ఓడిన వారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పిల్లి అద్దం ముందు నిలుచొని పులి అంటే.. అయిపోదు. వాడి పొజిషన్ ఏంటో చూసుకొని మాట్లాడుకోవాలి.
వాడికి వాడు హీరో అనుకుంటే ఎట్లా సరిపోతుంది?’’ అంటూ ప్రశ్నించిన ఆయన.. తన విద్యార్హతలు.. ఆస్తులపై ఆరోపణలు చేసిన యార్లగడ్డ వెంకటరావు.. దుట్టా రామచంద్రరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరిని ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసన్న ఆయన.. టీడీపీలో ఉన్నప్పుడు తాము ఎలా ఉన్నామో.. వైసీపీలోకి వచ్చిన తర్వాత అలానే ఉన్నామంటూ వ్యాఖ్యానించారు. ఎక్కువగా మాట్లాడితే డొక్క తీసి డోలు కడతామని వార్నింగ్ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేసిన వారిపై మండిపడ్డ వంశీ.. తాను పార్టీలో అందరిని కలుపుకు వెళతానని వ్యాఖ్యానించటం గమనార్హం. నిజంగానే అందరిని కలుపుకు వెళ్లే వాళ్లైతే.. ఇదే రీతిలో విరుచుకుపడతారా? అని ప్రశ్నిస్తున్నారు.
తన చేతిలో ఓడిపోయాడంటూ.. ‘‘వార్డుకు గెలవలేదు. మండలానికి గెలవలేదు. పంచాయితీకి గెలవల. నాకు సహకరించేదేంటి? నేను మర్యాదగా ఉన్నాను. పార్టీలో ఉన్నాను. నేను ఎవరొచ్చినా కలుపుకుపోతాను. వాళ్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం సహించేది లేదు’’ అని ఫైర్ అయ్యారు. తనకు.. కొడాలి నానికి ఇంకొకరి సాయం అవసరం లేదని తేల్చేశారు. తమకు తాము సొంతంగా డీల్ చేసుకోగలమన్న వంశీ.. తమ గురించి మాట్లాడినోళ్లను ఏం చేయాలో తమకు బాగా తెలుసన్నారు. ‘‘పిచ్చ పిచ్చగా మాట్లాడితే డొక్క పగలదీసి డోలు కడతాం’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
తాము మర్యాదగా ఉంటామని.. తాము ఎవరి జోలుకు వెళ్లమని.. తమ జోలికి వస్తే మాత్రం ఏం చేయాలో తమకు తెలుసన్నారు. ‘‘మేం అసలు వారి గురించి ఆలోచించే తీరికే లేదు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మా స్టైల్ ఎలా ఉందో.. వైసీపీలో ఉన్నప్పుడు మా స్టైల్ అలానే ఉంది’’ అన్న వంశీ.. నిజంగానే అంత బిజీగా ఉంటే.. వాళ్లు చేసిన ఆరోపణలకు పెద్దగా స్పందించకుండా ఉంటే సరిపోయేది కదా? అలా కాకుండా.. ఇంతలా రియాక్టు కావటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి రావటాన్ని యార్లగడ్డ.. దుట్టా ఇద్దరు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ప్రైవేటు సంభాషణల్లో వల్లభనేని వంశీ.. కొడాలి నానిపై చేసిన వ్యాఖ్యలు బయటకు రావటంతో తాజా దుమారానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ రియాక్టు అయ్యారు.