కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తాజాగా.. 2023-24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు.
ఎప్పటిలాగానే.. బడ్జెట్లో కొన్ని మౌలిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అవే.. సప్త మాతృకల మాదిరిగా.. ఏడు గుర్రాల స్వారీ చేశారు. ఈ బడ్జెట్లో ఏడు ప్రాథమ్యాలకు పెద్దపీట వేశారు. సమ్మిళిత అభివృద్ధి, చిట్టచివరి వ్యక్తికి కూడా సత్ఫలితాలు అందడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల వృద్ధి, ప్రజల శక్తి, సామర్థ్యాలను వినియోగించుకోవడం, హరిత వృద్ధి, యువ శక్తిని ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం వంటివాటిపై దృష్టి సారించారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ.. బడ్జెట్లో
వచ్చే ఏడాది కాలంలో వ్యవసాయం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలు. వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం, వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు. పత్తిసాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం.
ఆత్మ నిర్బర్ భారత్ క్లీన్ పథకం మరింత వేగవంతం చేయనున్నారు. ఉద్యానవన పంటలకు చేయూత. చిరుదాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం ‘శ్రీఅన్న’ పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటల ప్రోత్సాహం. అదేవిధంగా ఈ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా మరికొన్ని పథకాలు ప్రవేశ పెట్టారు. అమృత కాలం(పాతికేళ్ల లక్ష్యం)లో ఇది తొలి బడ్జెట్‌గా సీతారామన్ ప్రకటించారు.