అదానీ గ్రూప్.. వర్సెస్ హిండెన్‌బర్గ్ సంస్థ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత రెండు రోజులుగా ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్.. తాజాగా మరిన్ని ఆరోపణలు చేశారు. దీంతో అదానీ సంస్థ కూడా మాటల యుద్ధం కొనసాగిస్తోంది. దేశ వృద్ధిపై అక్కసుతోనే హిండెన్ బర్గ్ అసత్య ఆరోపణలు చేస్తోందంటూ 413 పేజీల స్పందనను తెలియజేసిన కొద్దిగంటల్లోనే ఆ సంస్థ మరోసారి విరుచుకుపడింది.
జాతీయవాదం పేరు చెప్పి, దేశ జెండాను అడ్డుపెట్టుకుని చేసిన మోసాన్ని కప్పి పుచ్చుకోలేరంటూ అదానీ గ్రూప్‌ను ఉద్దేశించి హిండెన్ బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత భారత స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూపు షేర్లు దారుణ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.
ఏంటీ హిండెన్ బర్గ్?
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ అనేది స్టాక్ మార్కెట్ కు చెందిన సంస్థ. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్ గతవారం ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపింది. ఈ హిండెన్ బర్గ్ నివేదికపై స్పందించిన అదానీ గ్రూప్ 413 పేజీల సుదీర్ఘ స్పందనను తెలిపింది. దానిపై తాజాగా స్పందించిన హిండెన్‌బర్గ్.. జాతీయవాదం పేరుతో చేసిన మోసాన్ని దాచిపెట్టలేరంటూ ఎదురుదాడి చేసింది.
కీలకమైన విషయాల నుంచి అదానీ గ్రూప్ దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందన్న హిండెన్‌బర్గ్.. అందుకే జాతీయ వాదాన్ని లేవనెత్తుతోందని మండిపడింది. భారత్‌పై దాడి చేసేందుకే తాము నివేదిక ఇచ్చామన్నట్లు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు హిండెన్‌బర్గ్ పేర్కొంది. భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్యమని ఉత్తేజకరమైన భవిష్యత్తుతో అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతోం దని విశ్వసిస్తున్నట్లు హిండెన్ బర్గ్ తెలిపింది.
క్రమపద్ధతిలో దోపిడీ!
జాతీయవాదం ముసుగులో భారత్‌ను క్రమపద్ధతిలో దోచుకుంటున్న అదానీ గ్రూప్.. దేశ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతోంద నేది నమ్ముతున్నామని హిండెన్‌బర్గ్ స్పష్టం చేసింది. జాతీయ జెండా వెనుక దాక్కుని దేశాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించిం ది. సంపన్నులైనా, పేదవారైనా మోసం ఎప్పటికీ మోసమేనని పేర్కొంది. తమ నివేదికలో 82 ప్రశ్నలడిగితే అందులో 62 ప్రశ్నలకు అదానీ గ్రూప్ సమాధానాలు చెప్పలేక పోయిందని ఎద్దేవా చేసింది. మొత్తానికి నిన్న మొన్నటి వరకు మార్మోగిన అదానీ పేరు.. ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారడం గమనార్హం.
Indian Media reporting on Hindenburg Research. pic.twitter.com/POsl6B3T3O
— Mohammed Zubair (@zoo_bear) January 25, 2023