+ సేవాభావం చాటిన ఎన్నారై మహిళా విభాగం అధ్యక్షురాలు జాగర్లమూడి శివానీ బృందం
+ ఏపీకి చంద్రబాబు అవసరం ఎంతో ఉందన్న ఎన్నారై టీడీపీ యూఎస్ కో ఆర్డినేటర్ జయరాం కోమటి
`ఏదేశమేగినా.. ఎందుకాలిడినా.. పొగడరా నీతల్లి భూమి భారతిని` అన్న రాయప్రోలు సుబ్బారావు స్ఫూర్తిని పుణికి పుచ్చుకున్న అమెరికాలోని ప్రవాస భారతీయలు(ఎన్నారై).. మాతృ భూమిపై కేవలం ప్రశంసల వర్షానికే పరిమితం కావడం లేదు. సేవాదృక్ఫథాన్ని కూడా చాటుతున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి స్థిరపడిన ఎంతో మంది మాతృరాష్ట్రాల సేవలో తరిస్తున్నారు. ఇలాంటి వారిలో ఎన్నారై టీడీపీ మహిళా విభాగం ఒకటి.
తాజాగా ఎన్నారై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు జాగర్లమూడి శివాని బృందం.. ఉత్తరాంధ్ర జిల్లాల ముఖద్వారంగా ప్రసిద్ధి చెందిన యలమంచిలిలో `అన్నాకేంటీన్` ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించారు. ఈ బృందానికి ఎన్నారై టీడీపీ అమెరికా కో ఆర్డినేటర్ జయరాం కోమటి పూర్తిగా సహకరించారు. సోమవారం(జనవరి 30) అన్నా క్యాంటీన్ ను ఘనంగా ప్రారంభించారు.
ఆ కార్యక్రమానికి యలమంచిలి టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ జగదీష్, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఎన్నారై టీడీపీ విభాగం కో ఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిలో ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అవసరం ఎంతో ఉందని తెలిపారు.
తాము విదేశాలలో నివశిస్తున్నా తమ మనసు ఇక్కడే ఉందని, ఇక్కడి ప్రజల గురించే ఆలోచిస్తోందని జయరాం కోమటి తెలిపారు. మహిళా విభాగం ప్రెసిడెంట్ జాగర్లమూడి శివాని బృందం యలమంచిలి నియోజకవర్గం ప్రజలతో మమేకమవుతున్నారని చెప్పారు. మహిళా విభాగం సభ్యులు ఇతర ప్రవాసుల సహకారంతో అన్నాక్యాంటీన్లు ఏర్పాటు చెయ్యటం అభినందించ దగిన కార్యక్రమమని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి పౌరుడు కలసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని.. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
కాగా, సభకు హాజరైన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నారై మహిళా విభాగం శివానీ నేతృత్వంలో చేపడుతున్నకార్యక్రమాలను కొనియాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని, టీడీపీ ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. అయితే, అప్పటి వరకు ప్రస్తుతం ప్రారంభించిన క్యాంటీన్ నిర్వహణకు సహకరిస్తామని అన్నారు.