టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి తారకరత్న కుప్పంలో లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా హఠాత్తుగా గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తారకరత్నను తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తారకరత్న పరిస్థితి విషమంగానే ఉందని రెండు రోజుల క్రితం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ఆ తర్వాత తారకరత్నను టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు. తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ…తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బెంగళూరులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తారకరత్న ఆరోగ్య స్థితిపై మరికొన్ని వివరాలు వెల్లడయ్యాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల 48 గంటల అబ్జర్వేషన్ ముగిసింది.
అయితే, తారకరత్నకు ప్రాణాపాయం లేకపోయినప్పటికీ ఈరోజు అన్ని రకాల వైద్య పరీక్షలను మరోసారి నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్న తారకరత్నకు ఎక్మో వ్యవస్థ ద్వారా శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా వైద్యులు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం తారకరత్న తాజా ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు మరో హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు, తారకరత్న ఆరోగ్యం కోసం నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నందమూరి అభిమానులు కూడా ప్రార్థించాలని చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కోరారు. తారకరత్న త్వరగా కోలుకొని సాధారణ స్థితికి రావాలని వారు ఆకాంక్షించారు. తారకరత్న తప్పకుండా కోలుకుంటారని ఆరోగ్యం కుదుటపడాలని ఆ భగవంతున్ని వారు ప్రార్ధించారు.