తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడు వస్తాయి..? ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. త్వరలోనే మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాటి ఫలితం చూసి.. అంటే మార్చి 2న ఈ మూడురాష్ట్రాల ఎన్నికలకు ఫలితం రానుంది. అప్పుడు కేంద్రంలోని బీజేపీ పరిస్థితి ని గమనించి.. అప్పుడు నిర్ణయం తీసుకుంటారనే చర్చ సాగుతోంది.
అయితే.. మరోవైపు.. ఈ ఏడాది డిసెంబరులో ఎలానూ.. ఎన్నికలు రానున్నాయి. కాబట్టి ముందస్తు వచ్చినా.. మూడు నాలుగు మాసాలకు ముందు వచ్చే అవకాశం కన్నా లేదు. ఎలా చూసుకున్నా.. రాష్ట్రం ఒకరకంగా.. ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయిందనే చెప్పాలి. ఇక, దీనిపై చర్చసాగుతున్న సమయంలో ఎవరికి వారు ఊహల్లో తేలిపోతున్నారు. ముందస్తే వస్తే.. తమదే విజయమని కాంగ్రెస్, బీజేపీలు బల్లగుద్ది చెబుతున్నాయి.
ఇక, ఈ ముందస్తు ముచ్చటపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ముందస్తు ముందస్టు అంటన్నరు.. ఎందుకురావాలె ముందస్తు.. మేమేం.. దొడ్డిదారిలో పాలన చేస్తున్నమా.. ఎవరినైనా వేధించి పాలన సాగిస్తున్నమా?“ అని ప్రశ్నించారు. అంతేకాదు.. పార్లమెంట్‌ను రద్దు చేసి వస్తే.. ముందస్తుకు మేం సిద్ధమని కేటీఆర్ అన్నారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధమేనన్నారు.
తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని, మనం రూపాయి ఇస్తే, కేంద్రం 46పైసలే ఇస్తోందని ఆయన మండిపడ్డారు. ‘‘నేను చెప్పిన లెక్క తప్పయితే రాజీనామాకు సిద్ధం. నిజామాబాద్ ఎంపీ కేంద్రం నుంచి ఏం తెచ్చారు?. జిల్లాకు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి జూట్ బోర్డు కూడా కూడా ఎత్తేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదు. రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థనైనా ఇచ్చారా’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మొత్తానికి ఇప్పట్లో ముందస్తు ముచ్చట లేదని కేటీఆర్ పరోక్షంగా చెప్పేశారన్న మాట.