అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయడానికి తమ దగ్గర డబ్బులు లేవంటూ జగన్ సర్కార్ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి మరీ మూడు రాజధానులే లక్ష్యం అని సొంతంగా వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు, రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం సరికాదని కూడా కొందరు వైసీపీ నేతలు గతంలో వ్యాఖ్యానించడం తెలిసిందే.
ఓ పక్క అమరావతి రాజధాని అని కోర్టు చెబుతోంటే మంత్రి గుడివాడ అమర్ నాథ్ మరో రెండు నెలల్లో విశాఖ నుంచే పాలన అంటూ మరోసారి షాకింగ్ ప్రకటన చేశారు.
మరో రెండు నెలల్లో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ అవతరిస్తుందంటూ జోస్యం చెప్పారు. అంతేకాదు, కొద్ది రోజుల్లో ప్రభుత్వ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభమవుతాయని కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫిబ్రవరి చివర్లో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే గుడివాడ అమర్నాథ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆలు లేదు చూలు లేదు ఏపీకి రాజధాని విశాఖ అని అమర్నాథ్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రాజకీయ పరిపక్వత లేని అమర్ నాథ్ వంటి నేతలకు మంత్రి పదవులు ఇస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మరికొందరు విమర్శిస్తున్నారు. విశాఖ రాజధాని అని చెబుతున్న అమర్ నాథ్…. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం కోర్టు నుంచి ఎందుకు ఉపసంహరించికుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.