టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్వరలోనే యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార కమిటీ సభ్యులు, తదితర నాయకులతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజా సమస్యలపై పోరాడేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని, పార్టీ యంత్రాంగం మొత్తం ఈ యాత్రను విజయవంతం చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మూర్ఖుడి పాలనలో ప్రజలు నలిగిపోతున్నారని, టిడిపి వస్తేనే అభివృద్ధి సాధ్యమని అచ్చెన్న అభిప్రాయపడ్డారు. ఇక, మూడున్నరళ్లుగా సైకోపై పోరాడుతున్నామని నారా లోకేష్ విమర్శించారు. టిడిపికి అధికారం, ప్రతిపక్షం రెండు కొత్త కాదనీ అన్నారు.
కానీ, ఇప్పుడున్న పరిస్థితులు వేరని, ఇటువంటి సైకో పాలనను మునుపెన్నడూ చూడలేదని లోకేష్ అన్నారు. కార్యకర్తలు, నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని, అయినా సరే ఎక్కడా తగ్గకుండా వారు పోరాడుతున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో ఏం పీకుతావో పీకు అని పసుపు జెండా కోసం ప్రాణమిచ్చే బ్యాచ్ మనందంటూ లోకేష్ కేడర్లో ఉత్సాహం నింపారు.
జగన్ రెడ్డికి జనం ఇచ్చిన ఒక్క ఛాన్స్ సద్వినియోగం చేసుకోలేదని, కేవలం కక్ష సాధింపు కోసమే 151 సీట్లను వాడుకున్నారని విమర్శించారు. ఇక, వైసిపి నాయకులు, కార్యకర్తలు సైతం జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, అందుకే ఈ మధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా జగన్ చెత్త పాలన గురించి విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. వార్ వన్ సైడని, ప్రజలంతా మన వైపే ఉన్నారని, సైకో పాలన పోయి సైకిల్ పాలన రాబోతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.
400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని, మీ సూచనలు మద్దతు కావాలని కోరారు. మన దేవుడు ఎన్టీఆర్, మన రాముడు చంద్రబాబుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు యువగళం మంచి వేదిక అని పిలుపునిచ్చారు.