‘బొమ్మరిల్లు’ భామ జెనీలియాను తెలుగు వాళ్లు మరిచిపోయి చాలా కాలమైంది. తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోయాక బాలీవుడ్లో కొన్ని చిత్రాలు చేసి.. ఆ తర్వాత రితీష్ దేశ్ ముఖ్‌ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ జెన్నీ.. ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఓవైపు హిందీలో ఓ సినిమా చేస్తూనే తన మాతృభాష మరాఠీలో ఆమె నటించింది. ఆ సినిమాకు హీరోనే కాదు.. దర్శకుడు కూడా ఆమె భర్త రితీషే. తెలుగులో సూపర్ హిట్టయిన నాగచైతన్య-సమంతల ‘మజిలీ’కి రీమేక్‌గా తెరకెక్కిన ఆ చిత్రం పేరు.. వేద్. ఓ తెలుగు సినిమాను మరాఠీలో రీమేక్ చేస్తున్నపుడు చాలామంది లైట్ తీసుకున్నారు కానీ.. ఈ చిత్రం మరాఠీలో సంచలన వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. ఓపెనింగ్స్ నుంచే జోరు చూపించిన ‘వేద్’.. రిలీజైన కొన్ని వారాల తర్వాత కూడా దూకుడు తగ్గించట్లేదు.
మరాఠీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘వేద్’ రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. వంద కోట్ల వసూళ్లతో ‘సైరాట్’ ఎన్నో ఏళ్ల నుంచి నంబర్ వన్ స్థానంలో ఉండగా.. ‘వేద్’ తాజాగా రూ.45 కోట్ల మార్కును అందుకుని.. రెండో స్థానానికి ఎగబాకింది. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట పెద్దగా బజ్ లేదు. కానీ విడుదల తర్వాత మరాఠీ ప్రేక్షకులు బాగా కనెక్టయిపోయారు. నిలకడగా వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్లిన ‘వేద్’ ఒక్కో సినిమాను అధిగమిస్తూ మరాఠీ ఆల్ టైం గ్రాసర్లలో రెండో స్థానానికి చేరుకుంది.
త్వరలోనే 50 కోట్ల మైలురాయిని కూడా దాటేయనుంది. మరాఠీ సినిమా మార్కెట్ స్థాయి ప్రకారం చూస్తే ఇది పెద్ద నంబరే. జెన్నీకి ఇంతకుమించిన రీఎంట్రీ ఉండదు. ఈ ఊపులో ఆమె మరిన్ని మరాఠీ చిత్రాలు చేయడం ఖాయం. హిందీలోనూ ఆమెకు అవకాశాలు బాగానే రావచ్చు. తెలుగులో సమంత చేసిన పాత్రనే ‘వేద్’లో జెన్నీ చేసింది. ఇక్కడ చైతూ-సమంత జోడీకి మనవాళ్లు కనెక్ట్ అయినట్లే.. అక్కడ రితీష్-జెన్నీ జంటకు మరాఠీ ఫ్యాన్స్ కనెక్టయ్యారు.