ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం మంటగలిసేలా జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 పై అన్ని పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాలరాసేలా జగన్ తెచ్చిన చీకటి జీవోపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు భోగి మంట ల సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు ఆ జీవో నెంబర్ ఒకటి కాపీని భోగి మంటల్లో వేసి తగులబెట్టారు.
ఇటువంటి చీకటి జీవోని తెచ్చిన జగన్ పాలన అంతం కావాలని వారంతా కోరుకున్నారు. అయితే, సత్యసాయి జిల్లా ధర్మవరంలో భోగిమంటల్లో జీవో నెంబర్ ఒకటి తగలబెడుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు, ఆ భోగి మంటలను బూటుకాళ్లతో ఆర్పేందుకు పోలీసులు ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది. జీవో నెంబర్ 1 కాలిపోకుండా కాపాడాలన్న పోలీసుల అత్యుత్సాహం విమర్శల పాలైంది.
హిందువులు పవిత్రంగా భావించే భోగి మంటలను పోలీసులు బూటుకాళ్లతో ఆపేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ వారు గట్టిగా నినాదాలు చేశారు. దీంతో, ఘటనా స్థలంలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవడం సరికాదని టీడీపీ నేతలు అన్నారు. సంప్రదాయబద్ధమైన భోగి మంటలను బూటు కాలుతో అర్పడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏదేమైనా భోగి పండుగనాడు ధర్మవరంలో పోలీసుల అత్యుత్సాహం తీవ్ర విమర్శల పాలైంది. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.