నీతిగా నిజాయితీగా ఉండేటోడితో వచ్చే చిక్కేమంటే.. అతగాడు మౌనంగా ఉన్నంతవరకు ఏమైనా మాట్లాడేయొచ్చు. కానీ.. అలాంటోడు ఒకసారి నోరు తెరిస్తే మాత్రం.. అప్పటివరకు మాట్లాడిన వారి మాటలన్ని కూడా పులిహోర అయిపోతాయి. తాజాగా అలాంటి పరిస్థితినే తీసుకొచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసానికి వెళ్లి కలిసిన పవన్ దాదాపు రెండున్నర గంటల పాటు ఆయనతో మాట్లాడారు.
దీంతో.. చంద్రబాబు.. పవన్ మధ్య ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు?వారి మధ్య జరిగిన చర్చ ఏమిటి? లాంటి పలు ప్రశ్నలు తెర మీదకు రావటమే కాదు.. బోలెడన్ని ఊహాగానాలు.. అంచనాలు వెలువడ్డాయి. ఇక.. వైసీపీనేతలు ఇదే అవకాశంగా మార్చుకొని నోటికి వచ్చినట్లుగాఅనేయటం మొదలు పెట్టారు.
చంద్రబాబుతో జరిగిన సమావేశం గురించి తాజాగా రణస్థలంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వేలాది మందితో మాట్లాడిన క్రమంలో ఉన్నది ఉన్నట్లుగా.. జరిగింది జరిగినట్లుగాచెప్పేయటం ఒక ఎత్తు అయితే.. తాను రెండున్న గంటల పాటు ఏయే విషయాల మీద మాట్లాడింది.. సెకన్లతో సహా చెప్పేయటం చూసినప్పుడు పవన్ లెక్కలకు ఫిదా కావాల్సిందే.
ఇద్దరు ప్రముఖ నేతలు భేటీ అయినప్పుడు వారి మధ్య ఏం మాటలు నడిచాయన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరగటం.. పలు అభిప్రాయాలు బయటకురావటం మామూలే. అందుకు భిన్నంగా తాను బాబుతో ఏమేం మాట్లాడమన్న విషయాల్ని పూస గుచ్చినట్లుగా వివరంగా చెప్పేసిన తీరు చూస్తే ఫిదా కాక మానరు. ఇంత క్లియర్ గా ఇటీవల కాలంలో ఏ అధినేత క్లారిటీ ఇవ్వలేదని మాత్రం చెప్పక తప్పదు.
ఇంతకీ చంద్రబాబుతో రెండున్నర గంటల పాటు సాగిన భేటీలో ఏమేం మాట్లాడుకున్నారన్నది పవన్ మాటల్లోనే చూస్తే.. ‘‘విశాఖలో ఆపినప్పుడు మన కోసం వచ్చారు. సానుభూతి తెలపడం మా బాధ్యత. మాట్లాడితే రెండున్నర గంటలు ఏం మాట్లాడారు అని అడుగుతున్నారు. మొదటి పది నిమిషాలు బాగున్నారా అంటే బాగున్నారా అని పలుకరించుకున్నాం. 11వ నిమిషం నుంచి పోలవరాన్ని చేసే ఇరిగేషన్ మంత్రి సంబరాల రాంబాబు గురించి 23 నిమిషాల రెండు సెకన్లు మాట్లాడుకున్నాం.
తర్వాత సన్నాసి ఐటీ మంత్రి రాష్ట్రాన్ని 15వ స్థానంలో పెట్టేశాడు ఏంటని 18 నిమిషాలు మాట్లాడుకున్నాం. శాంతి భద్రతల గురించి 35 నిమిషాలు మాట్లాడుకున్నాం. మళ్లీ టీ ఇచ్చారు. ఆ సందర్భంగా దాదాపు పదిహేను నిమిషాలు గడిచిపోయాయి’’ అని చెప్పారు.
తన మాటల్ని కొనసాగిస్తూ.. ‘‘ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది మాట్లాడుకున్నాం. చివరిగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని చెప్పా’’ అంటూ చంద్రబాబుతో తనకు జరిగిన రెండున్నర గంటల భేటీ గురించి వివరంగా చెప్పేశారు.
పొత్తులకు సంబంధించి తన మనసులోని మాటను చంద్రబాబుకు చెప్పేసిన విషయాన్ని చెప్పేసిన పవన్.. దానికి కొనసాగింపుగా వచ్చే సీట్ల లెక్కల గురించి ఎలాంటి మాటలు జరగలేదన్న విషయాన్ని క్లియర్ గా చెప్పటం కనిపిస్తుంది. ఈ సందర్భంగా పవన్ నోటి నుంచి వచ్చిన ఒక మాటను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అదేమంటే.. ‘‘వైసీపీ అద్భుతంగా పాలిస్తుంటే నేను గొంతెత్తేవాడిని కాదు. బాగా పాలిస్తుంటే చప్పట్లు కొట్టే వాడిని. ప్రజల్ని బాధిస్తుంటే ఎదురుతిరుగుతాం’’ అని స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. గతంలో టీడీపీని తిట్టావు కదా? అన్న ప్రశ్నను ప్రస్తావిస్తూ.. ఇరుగుపొరుగువారితో కొన్ని సందర్భాల్లో తేడాలు వచ్చినా.. చుట్టూ ఉండే వారికి తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఇచ్చిపుచ్చుకునే విధానం ఉంటుందని..అదే కోణంతో టీడీపీతో తాను కలిసి ప్రయాణించే అవకాశం ఉందన్న విషయంపైన స్పష్టత ఇచ్చారని చెప్పక తప్పదు.