టీకాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఏమాత్రం ఒక్క మెట్టు కూడా దిగడం లేదు. పార్టీలో అసంతృప్తి మరోసారి బయటపడింది. రేవంత్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు. బుధవారం బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో టీపీసీసీ శిక్షణ సదస్సు నిర్వహించింది. దీనికి మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు రాలేదు.
అయితే.. తాను హాజరుకాలేనంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటరీ కమిటీ, ఏఐసీసీకి సమాచారం ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇక శ్రీధర్ బాబు కర్ణాటకలో పార్టీ వ్యవహారాలకు సంబంధించి పనులు చేస్తూ రాలేకపోయినట్లు చెప్పుకొంటున్నారు. మిగతావారు తమ గైర్హాజరుపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదట.
కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు పీసీసీ కమిటీలు వేసిన తరువాత గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశానికి కూడా సీనియర్లు రాలేదు. దాంతో వారికి కౌంటర్‌గా రేవంత్ వర్గానికిచెందిన కొందరు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ వివాదం తరువాత దిగ్విజయ్ సింగ్‌ను దూతగా పంపించింది అధిష్ఠానం.
దిగ్విజయ్ వచ్చి అందరితో మాట్లాడిన తరువాత పరిస్థితి చక్కబడిందనుకున్నారు. కానీ… తాజా సమావేశానికి కూడా సీనియర్లు రాలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా కొందరికి ఫోన్ చేసి ఈ సమావేశానికి వెళ్లమని చెప్పినప్పటికీ వారు వినలేదంటున్నారు.
దీంతో సీనియర్లు పార్టీ అధిష్టానం మాట కూడా వినడం లేదని స్పస్టమవుతోంది. అంతేకాదు.. రేవంత్ రెడ్డి తలపెట్టబోయే పాదయాత్రకు అధిష్ఠానం అనుమతి లేదంటూ మహేశ్వర్ రెడ్డి తరచూ అంటుండడం కూడా ముందుముందు మరింత ముదరనుందని అర్థమవుతోంది.