కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నాయకుడు అమిత్ షా ఏపీలో పర్యటించనున్నారు. వాస్తవానికి ఈ నెల 4(బుధవారమే) ఆయన పర్యటన ఉంటుందని ముందుగా సమాచారం అందింది. అయితే, కేంద్రంలో కీలకమైన వ్యవహారం ఉండడంతో ఆయన తన పర్యటనను ఈ నెల 8కి వాయిదా వేసుకున్నారు. ఈ నెల 8న ఆయన రెండు జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు. కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో ఆయన పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. దీని ప్రకారం.. ఆయన ఆయా జిల్లాల పార్టీ నాయకులతో భేటీ అవుతారు.
వరుస భేటీల్లో అమిత్షా ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు.. అమిత్షా.. పార్టీకి దశ-దిశ నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా షా దృష్టి పెడతారని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యూహాలు, వాటికి ప్రతి వ్యూహాలు.. వంటివాటిని షా దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్నికల్లో పొత్తులపై అమిత్ షా ప్రధానంగా నాయకులకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. అయితే.. జనసేన మాత్రం వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తానని చెబుతోంది. ఈ క్రమంలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతానని కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఈ క్రమంలో అమిత్ షా వైఖరి ఏంటి? ముఖ్యంగా టీడీపీ విషయంలో ఆయన ఎలా ముందుకు సాగాలని అనుకుంటున్నారనేది కూడా తేలి పోనుందని తెలుస్తోంది. ఇక, రాష్ట్రంలో ఎన్నికల నాటికి చేయాల్సిన ప్రచారం.. రాజకీయ అంశాలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకునుఎలా పొదివి పట్టుకోవాలనే అంశాలపైనా షా దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా ప్రజల్లో సెంటిమెంటుగా మారిన రాజధాని అంశాన్ని కూడా షా ప్రస్తావిస్తారని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం మూడురాజధానులు అని ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ అమరావతికి మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజధాని రైతుల పాదయాత్రలోనూ బీజేపీ నేతలు పాదం కలిపారు. ఈ క్రమంలో షా ఈ విషయంపై ఎలాంటి వ్యూహంతో ఉన్నారనేది కూడా తేలుతుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. అమిత్ షా పర్యటన బీజేపీకి ఎన్నికల రోడ్ మ్యాప్ అందించడం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయి.