ఏపీ బీజేపీలో అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా పార్టీ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. ఇటీవల ఆరు జిల్లాలలో పార్టీ అధ్యక్షులను మార్చుతూ వీర్రాజు నిర్ణయం తీసుకోవడంతో కొన్నిచోట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్ షా ఏపీ పర్యటనకు ముందు పార్టీలో ఈ గందరగోళం తలెత్తడంతో వీర్రాజుకు తలనొప్పి మొదలైనట్లయింది.
పార్టీలో సీనియర్లను సంప్రదించకుండా జిల్లాల అధ్యక్షులను ఏకపక్షంగా మార్చారంటూ బీజేపీ సీనియర్ నేతలు తుమ్మల ఆంజనేయులు, కుమారస్వామిలు ఇటీవల రాజీనామాలు చేశారు. వీరు తమ రాజీనామాల సందర్భంలో వీర్రాజుపై మండిపడ్డారు. వీర్రాజు ఒంటెద్దు పోకడలకు పోతున్నారంటూ విమర్శించారు.
శ్రీకాకుళం, అనకాపల్లి, రాజమండ్రి, మచిలీపట్నం, నర్సరావుపేట, ఒంగోలు జిల్లాలలో వీర్రాజు కొత్తగా అధ్యక్షులను నియమించారు. శ్రీకాకుళం వంటి పాత జిల్లాలలో ఉన్న అధ్యక్షులను మార్చి కొత్తవారిని నియమించారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తమ పదవీకాలం ముగిసేవరకు తొలగించే అధికారం లేదంటూ అప్పటికే అధ్యక్షులుగా ఉన్న నేతలు మండిపడ్డారు.
కాగా జిల్లాలలో అధ్యక్షుల మార్పు విషయం కోర్ కమిటీలోని మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్సీ మాధవ్, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరిలకు కూడా సమాచారం ఇవ్వకుండా వీర్రాజు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. తొలగింపునకు గురైనవారంతా కన్నా వర్గీయులని బీజేపీ నేతలు చెప్తున్నారు.
ఇప్పటికే ఆరుగురు నేతలను మార్చిన సోము వీర్రాజు మరో 5 జిల్లాలలో కన్నా వర్గానికి చెందిన వారిని పదవుల నుంచి తొలగించేందుకు రెడీ అవుతున్నట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజుపై ఫిర్యాదు చేసేందుకు పలువురు నేతలు దిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.