ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ప్రతిపక్షాల వ్యూహాలను, ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు అధికార పక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏ పార్టీ కూడా ర్యాలీలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు జరపకూడదని జీవో ఇచ్చింది. దీనికి సంబంధించి సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
గుంటూరు, కందుకూరు తొక్కిసలాట ఘటనల దృష్ట్యా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్టు నిబంధనలు వర్తింపజేశారు. ఆ ప్రాంతాల్లో రోడ్డుషోలు నిర్వహించడానికి ఎలాంటి అనుమతి ఇవ్వరు. అదేసమయంలో రోడ్డుకు దూరంగా, ప్రజలకు ఇబ్బందిలేని ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో మాత్రమే సభలకు అనుమతి ఇస్తారు.
సభలు, రోడ్డుషోలు నిర్వహించే రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రదేశాల ఎంపికపై ప్రభుత్వమే సూచనలు చేయనుంది. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించకుండా చూడాలని హోంశాఖ సదరు ఆదేశాల్లో స్పష్టం చేయడం గమనార్హం. అయితే.. ఇవన్నీ కూడా కందుకూరు, గుంటూరుల్లో జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలోనే తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కానీ, దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కమ్యూనిస్టులు విమర్శించారు. కందుకూరు, గుంటూరు ప్రమాద ఘటనలను సాకుగా చూపి జగన్ సర్కార్ తీసుకున్న నిరంకుశ నిర్ణయమని బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు మానుకుంటారా అని ప్రశ్నించారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మరోసారి వివాదానికి దారితీయడం గమనార్హం.