అగ్గిపుల్ల…కుక్కపిల్ల….సబ్బు బిళ్ల …కాదేదీ కవితకనర్హం అన్నది ఔట్ డేటెడ్ కొటేషన్….సెక్స్.. .సినిమాలు… రాజకీయాలు.. కావేవి వర్మ విమర్శలకనర్హం…అన్నది అప్డేటెడ్ కొటేషన్. టాలీవుడ్, బాలీవుడ్లలో మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్గా పేరున్న వర్మ…అనేక వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నూతన సంవత్సర వేడుకల విషయంలోనూ వర్మ తన వినూత్నతను చాటుకున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు తప్ప ప్రపంచంలోని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ వర్మ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఎవరు ఎవరికి శుభాకాంక్షలు చెబుతున్నారన్నది ముఖ్యం కాదని, ఎవరూ ఎవరికీ హృదయపూర్వకంగా చెప్పడం లేదని వర్మ ఫిలాసఫీ చెప్పారు. పాత సంవత్సరంలో సమస్యలు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయని, మరిన్ని సమస్యలు పాత వాటితో కలుస్తాయని అన్నారు.
నెరవేర్చుకోలేని తీర్మానాలనే కొత్త ఏడాదిలో చేసుకుంటామని వర్మ వేదాంతం చెప్పారు. కనీసం ఈ విషయంలోనైనా నీతి, నిజాయతీగా ఉండాలని కొటేషన్ ఇచ్చారు. సమస్యలన్నీ డిసెంబరు 31, 2022 రాత్రి వరకు మాత్రమేనని, పడుకుని నిద్రలేగానే జనవరి 1, 2023 నుంచి మళ్లీ కొనసాగుతాయని అన్నారు. అదే పాత భార్య, అదే పాత భర్తతో ఉంటున్నామని అని ట్వీట్ చేశారు. కొత్త ఏడాదిలో నేరస్థులెవరూ పట్టుబడకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. అనామక నటులు…షారుఖ్, సల్మాన్, ఆమిర్ఖాన్లను మించిపోవాలని కోరుకున్నారు. ఈ కొత్త ఏడాదిలో భర్తలను మరింత అర్థం చేసుకోవాలని భార్యలకు సలహా ఇచ్చాడు రామూ.