ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీలో క్రిస్టియానిటీ పెరిగిపోయిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ వ్యవహారంపై గణాంకాలతో సహా రాష్ట్రపతికి, ప్రధానికి రఘురామ లేఖ కూడా రాశారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పైకి హిందువుల నిరంతరం చర్చిల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే చర్చి నిర్మాణానికి తన ఎంపీ లాడ్స్ ఫండ్స్ ను వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఖర్చు చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు, విగ్రహాలు, రథాలుల, ఆస్తులపై దాడులు పెరిగిపోయాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. విజయనగరంలో ప్రఖ్యాతిగాంచిన రామతీర్థ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల నరికివేసిన ఘటన పెనుదుమారం రేపింది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విఘ్నేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన సంచలనం రేపింది. జగన్ పాలనలో హిందూ దేవాలయాల విషయంలో జరుగుతున్న పరిణామాలతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి చారిత్రక రథం దగ్ధం ఘటన, విజయవాడ కనకదుర్గ ఆలయంలో సింహాల ప్రతిమల దొంగతనం, తిరుపతిలో సీఎం జగన్ డిక్లరేషన్ వ్యవహారం, కాకినాడలో దేవీ విగ్రహాలు ధ్వంసం, నెల్లూరులో రథం ధ్వంసం, ఆర్చీలు బద్దలు కొట్టడం, ఆంజనేయుడి స్వామి విగ్రహం చేతులు విరగ్గొట్టడం,విజయనగరంలోని రామతీర్థ ఆలయంలో రామచంద్రస్వామి విగ్రహం తల నరికివేత…వంటి వందలాదిఘటనలు ఏపీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని, గత మూడున్నరేళ్లుగా జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనమని అన్నారు. వైసీపీ హయాంలో 285 దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు జరిగాయని, ఒక్క ఘటనలో కూడా దోషులను పట్టుకోలేదని ఆయన ఆరోపించారు.