టాలీవుడ్ మూవీ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య‘ లో హీరో సత్యదేవ్ పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం గుర్తుండిపోయింది. తనను కొట్టిన యువకుడిపై ప్రతీకారం తీర్చుకునేదాకా చెప్పులు తొడుక్కోనంటూ ఆ సినిమాలో సత్యదేవ్ భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. చివరకు ఆ యువకుడితో పోటీపడి గెలిచి అందులో విజయం సాధించిన తర్వాతే చెప్పులు వేసుకుంటాడు. సరిగ్గా ఇదే తరహాలో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మంత్రి 2 నెలల నుంచి చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు.
తన నియోజకవర్గంలో రోడ్లు బాగోలేవని, ఆ రోడ్ల మరమ్మతులు అయ్యేవరకు చెప్పులు వేసుకోనని మధ్యప్రదేశ్ ఇంధన శాఖా మంత్రి, గ్వాలియర్ ఎమ్మెల్యే ప్రద్యుమన్ తోమర్ ప్రతిజ్ఞ చేశారు. అక్టోబర్ 20వ తేదీన తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా రోడ్లు అధ్వాన్నంగా కనిపించడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. ప్రజలు కూడా ఈ దుస్థితిపై మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో, ఆ రోడ్లు బాగు చేయించే వరకు తాను చెప్పులు వేసుకోనంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారమే రెండు నెలల్లో ఆ రోడ్లకు మరమ్మతులు చేయించారు. దీంతో, ప్రద్యుమన్ కు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా చెప్పులు ఇచ్చి ధరించేలా చేశారు. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రోడ్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కేంద్ర మంత్రి సింధియాకు తోమర్ కృతజ్ఞతలు తెలిపారు. కాళ్లకు చెప్పులరిగేలాగా రోడ్లు బాగు చేయాలని ఏపీలోని పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నా సరే స్పందన కరువైన పరిస్థితి.
కానీ, పొరుగు రాష్ట్రం మధ్యప్రదేశ్లో మాత్రం స్వయంగా రోడ్లు బాగు చేసేదాకా చెప్పులు వేసుకోనని కూర్చున్న మంత్రి. వీటిని చూస్తుంటే తాము ఆంధ్రప్రదేశ్ లో కాకుండా మధ్యప్రదేశ్లో ఉన్నా బాగుండేది అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. ఇక, ఈ రోజుల్లో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడడ్డ తోమర్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. తోమర్ కు సింధియా చెప్పులు తొడిగిన వీడియో వైరల్ అయింది.
On Union Minister Jyotiraditya Scindia’s assurance, protesting Madhya Pradesh Minister Pradyuman Singh Tomar wears slippers after 66 days which he had forsaken for road work completion pic.twitter.com/2SqJKutMmn
— Free Press Journal (@fpjindia) December 25, 2022