సీఎం జగన్ అస్తవ్యస్థ పాలన, అపరిపక్వ నిర్ణయాలతో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విపక్షాలు మొదలు జాతీయ మీడియా వరకు గగ్గోలు పెడుతున్నాయి. తన మానస పుత్రికలైన నవరత్నాలు, ఉచిత పథకాల కోసం ఖజానాలోని డబ్బులను పప్పు బెల్లాల్లాగా జగన్ పంచిపెడుతున్న వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ మొదలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరకు అందరూ ఏపీ అప్పులు…వాటి కోసం జగన్ పడుతున్న తిప్పలపై ఎన్నో వార్నింగ్ లు ఇచ్చారు.
ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి, దేశాభివృద్ధికి ప్రతిబంధకాలని మోదీ కూడా అభిప్రాయపడ్డారు. ఇక, ఉచిత పథకాలు, హామీల విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదా? అంటూ సుప్రీం కోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కూడా గతంలో ప్రశ్నించింది. ఉచిత పథకాలపై రాష్ట్రాలు వెచ్చించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆయా రాష్ట్రాలకు రెవెన్యూ కేటాయింపులను నియంత్రించవచ్చా? అనే అంశాన్ని ఫైనాన్స్ కమిషన్ను అడిగి తెలుసుకోవాలని కేంద్రానికి సూచించింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ చేస్తున్న అప్పులు..జీతాల కోసం పడుతున్న తిప్పల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దేశంలోని ఓ రాష్ట్రం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోందని, కానీ, దేశవ్యాప్తంగా భారీగా ప్రకటనలు ఇస్తోందని విమర్శించారు. రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై నిన్న జరిగిన చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒక రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు నిరసన కూడా తెలుపుతున్నారని, కానీ, తాను ప్రత్యేకంగా ఆ రాష్ట్రం పేరును ప్రస్తావించడం లేదని, పత్రికల్లో వస్తున్న వార్తలను ప్రస్తావిస్తున్నానని అన్నారు. ప్రకటనల వల్లే ఆ రాష్ట్రం జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుని ఉండొచ్చన్నారు. సబ్సిడీలు, ఉచితాల విషయంలో బేరీజు వేసుకోవాలని, బడ్జెట్లో వాటిని చూపిస్తే అందుకు తగిన నిధులు కేటాయించాలని సూచించారు. విద్య, వైద్యం, రైతులకు సబ్సిడీలు ఇవ్వడం మాత్రం న్యాయమేనని అన్నారు. అయితే, జగన్ లేదా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి నిర్మల ఈ కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.