కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ను ఢీకొట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రారంభించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి నరేంద్ర మోడీని గద్దె దించడమే టార్గెట్ గా కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు. అయితే, కేసీఆర్ ఎత్తులను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆయనకు తాజాగా షాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే గతంలో బీఆర్ఎస్ ను ప్రకటించిన 24 గంటలలోపే కేసీఆర్ పై మోడీ కక్ష సాధించినట్లు కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన తీర్పునివ్వడం వెనుక కేంద్రం హస్తం ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ తీర్పుపై మంత్రి జగదీశ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును ఆపేందుకు ఎవరో కుట్ర పన్నారని పరోక్షంగా బీజేపీపై అనుమానం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఆ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టామని, ఈ తీర్పును సవాల్ చేస్తామని, రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పారు.
ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ మరో షాక్ ఇచ్చింది. డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పర్యావరణ అనుమతులు లేంటూ భారీ ఫైన్ వేసింది. నిర్మాణాలను నిలిపివేయాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను పాటించనందుకు రూ. 900 కోట్ల జరిమానాను విధించింది. మొత్తం నిర్మాణ వ్యయంలో 1.5 శాతం జరిమానాను విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది.
పర్యావరణ అనుమతులు లేకుండా ఆ నిర్మాణాలు చేపట్టారని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై స్పందించిన ఎన్జీటీ ఆ ఆదేశాలు జారీ చేసింది. అనుబంధ పిటిషన్లు వేశారు. ఏపీ ప్రభుత్వం, కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వర రెడ్డిలు దానికి అనుబంధ పిటిషన్ వేశారు. అయితే, ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కొద్ది రోజులకే ఎన్జీటీ మరోసారి కేసీఆర్ సర్కార్ కు షాకివ్వడం సంచలనం రేపుతోంది.