తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖమ్మంలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. చంద్రబాబు సభ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పసుపు మయం అయింది. ఈ సభలో ప్రసంగించిన చంద్రబాబు…తెలంగాణ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. ఈ సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చారని, తాను కోరుకుంటోంది అధికారం కాదని, ప్రజల ఆశీస్సులు, అభిమానం అని అన్నారు.
ఏపీలో గాడి తప్పిన పాలనను గాడిలో పెడతానని, కాసాని జ్ఞానేశ్వర్ వంటి నేతల సాయంతో తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు విడివిడిగా డెవలప్ అయి దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కొందరు బుద్ధి లేనివాళ్లు రెండు రాష్ట్రాలను కలుపుతామంటున్నారని, జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరూ అలా మాట్లాడరని సజ్జలకు పరోక్షంగా చురకలంటించారు. తెలంగాణలో ప్రాజెక్టులు తీసుకువచ్చింది టీడీపీ అని, ప్రజలను ఓటు అడిగే హక్కు టీడీపీకే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, ఎంపీ లేకున్నా సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే ఎంతో ధైర్యం కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నికలు, ఓట్ల కోసం తాను గతంలో పని చేయలేదని…భవిష్యత్తులో కూడా పని చేయబోనని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మబంధువుగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. పార్టీ రుణం తీర్చుకుంటామంటూ జెండా పట్టుకొని యువత ముందుకువచ్చారని తెలిపారు.
టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుందని, బంగారు భవిష్యత్తుకు నాంది పలకబోతోందని చెప్పారు. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు శక్తి అని ,చిరకాలం తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు అని ప్రశంసించారు.
రూ.2 కిలో బియ్యం, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, మండల వ్యవస్థ, సింగిల్ విండో విధానం, పేదలకు పక్కా భవనాలు వంటి ఎన్నో చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అందుకే ఆ యుగపురుషుడి గుర్తుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. తాను ఐటీ రంగం ప్రాధాన్యతను 25 ఏళ్ల క్రితమే గుర్తించానని, యువతలా ఆలోచించి ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడీ స్థాయిలో ఉండడానికి కారణం తానేనని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ను తెలంగాణకు పరిచయం చేశానని, బిల్ గేట్స్ 10 నిమిషాలు అపాయింట్ మెంట్ ఇస్తే..గంట మాట్లాడేలా చేశానని చెప్పారు. భారతీయుల మేధాశక్తి ఎలాంటిదో ఆయనకు వివరించానని, డిజిటల్ సత్తాలో మనతో పోటీ పడేవాళ్లు లేరని అన్నారు.