తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం, మిగతా సీనియర్ల వర్గం మధ్య గొడవలు తారస్థాయికి చేరింది. రేవంత్ అధ్యక్షతన గాంధీ భవన్లో నిర్వహించిన కీలక పీసీసీ సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు.
మీటింగ్ కి రాకుంటే హైకమాండ్ ని థిక్కరించినట్టేనని హెచ్చరించినా..ఆ హెచ్చరికల్ని పట్టించుకోకుండా సీనియర్లు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అదే సమయంలో రేవంత్‌కు మద్దతుగా ఉన్న నేతలు.. ముఖ్యంగా రేవంత్‌తో పాటు, ఆయన వెంట టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలు 13 మంది రాజీనామా చేశారు.
పీసీసీ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనారసింహ, మహేశ్వర్ రెడ్డి, గీతారెడ్డి, మధుయాష్కీ డుమ్మా కొట్టారు.
దాంతో సీనియర్లకి రేవంత్ రెడ్డి వర్గం కౌంటర్లు ఇస్తోంది. 13మంది రేవంత్ వర్గం నేతలు, టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, విజయరమణారావు, చారగొండ, వెంకటే, ఎర్రశేఖర్ సహా మరికొందరు నేతలు రాజీనామా చేశారు. వీరంతా తమ రాజీనామా లేఖలను మాణిక్యం ఠాగూర్‌కు పంపించారు.
సీనియర్ల ఎత్తుకు రేవంత్ వర్గం పైఎత్తు వేయడంతో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం రసకందాయంలో పడింది.