టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని సీఎం జగన్ టార్గెట్ చేశారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడ విషయంలో జగన్ ఆదేశాలతోనే అధికారులు అయ్యన్నపై కక్షగట్టారని ఆరోపణలు వచ్చాయి. జలవనుల శాఖకు చెందిన 16 సెంట్ల భూమిని అయ్యన్న కబ్జా చేశారంటూ అయ్యన్నపై గతంలో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు.
అంతేకాదు, ఆయనపై సెక్షన్ 467 వంటి తీవ్రమైన సెక్షన్ ప్రకారం విచారణ జరుపుతామంటూ సిఐడి అధికారులు కోరారు. దీంతో, తనపై నమోదైన భూ ఆక్రమణ కేసు కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో అయ్యన్న పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో సెక్షన్ 467 వర్తించదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అయ్యన్నకు 41ఏ నోటీసులు జారీ చేయవచ్చని, సిఐడి దర్యాప్తు జరుపుకోవచ్చని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొద్ది రోజుల క్రితం ఆదేశించింది.
అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాజాగా నేడు ఆ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు…జగన్ సర్కార్ కు షాకిచ్చింది. 10 ఏళ్లకు పైన శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని సుప్రీం స్పష్టం చేసింది. జలవనరుల శాఖ ఇచ్చిన ఎన్ఓసీ విలువైన పత్రాల నిర్వచనం కిందకు రాదని దేశపు అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం…ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. దీంతో, ఈ వ్యవహారంలో జగన్ కు షాక్ తగిలి అయ్యన్నకు ఊరట లభించినట్లయింది.