టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో సూర్యారావుపేటలో లోకేష్ పై పెట్టిన కేసును హైకోర్టు ధర్మాసనం నేడు కొట్టివేయడంతో ఆయనకు ఊరట లభించినట్లయింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడును విజయవాడ సీటీ కోర్టులో పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్‌పై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ లోకేష్ హైకోర్టును ఆశ్రయించగా…హైకోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.
మరోవైపు, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఓ ఎమ్మెల్యే తమ్ముడో, అన్నో నన్ను చంపేస్తాడంట.. మేం కొట్టే బ్యాచే కానీ కొట్టించుకునే బ్యాచ్ కాదు అని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల కోసం పోరాడతాంమని, అందుకే తనపై 15 కేసులున్నాయని లోకేష్ అన్నారు. బెదిరిస్తేనో, కేసులు పెడితేనో నీలా పారిపోయే రకం కాదు జగన్ రెడ్డీ అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.
తమ ప్రశ్నలకు వైసీపీ నేతలు సరిగ్గా సమాధానం కూడా చెప్పుకోలేరని, తాము ఛాలెంజ్ చేస్తే ఒక్క వైసీపీ నేత కూడా రోడ్డుపై తిరగలేడంటూ హెచ్చరించారు. అక్రమాస్తుల కేసులో సహ నిందితుల్ని నమ్ముకున్న జగన్ ను జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. నమ్మి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, రైతులను నట్టేట ముంచావు కదా జగన్ అంటూ విమర్శించారు.
అవినీతి, డబ్బు, దౌర్జన్యాలు, కబ్జాలు, విధ్వంసాన్ని నమ్ముకున్న జగన్ రెడ్డిని సాగనంపే సమయం ఆసన్నమైందని లోకేష్ అన్నారు. తనకి ఛానెల్స్, పేపర్స్ లేవని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్న జగన్ రెడ్డి అక్రమాస్తుల పుత్రిక సాక్షి ఉందని దుయ్యబట్టారు.